ఢిల్లీలో సంపూర్ణ లాక్ డౌన్
posted on Apr 19, 2021 @ 12:36PM
కరోనా మహమ్మారి పంజా విసురుతుండటంతో ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆరు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం ఐదు గంటల వరకు లాక్ డౌన్ అమలవుతుందని తెలిపారు.
కరోనా చైన్ తెగ్గొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేజ్రీవాల్ చెప్పారు. సోమవారం ఉదయం అధికారులతో అత్యవసర సమావేశం తర్వాత ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. లాక్‌డౌన్ సందర్భంగా మాల్స్, జిమ్‌లు, ఆడిటోరియంలు మొదలైనవి పూర్తి స్థాయిలో మూసివేయనున్నారు. అయితే సినిమా హాళ్లు 30 శాతం సామర్థ్యంతో నడపనున్నారు. ప్రయివేటు సంస్థలన్నీ వర్క్ ఫ్రమ్ హోం ద్వారా పనిచేయాలనీ... ప్రభుత్వ కార్యాలయాలు, అత్యవసర సేవల విభాగాలు యధాతథంగా పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. వీకెండ్ మార్కెట్ల నిర్వహణకు కూడా అనుమతి ఇచ్చారు.
దేశంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,73,510 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 1,619 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు భారతదేశంలో 19.29 లక్షలు యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1.29 కోట్లు మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 1.50 కోట్లు దాటాయి. కరోనా వల్ల లక్షా 78 వేల మంది మృతి చెందినట్లు సోమవారం కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.