అమరావతికి చెల్లు.. చెల్లెమ్మపై గొల్లు
posted on Apr 19, 2021 @ 11:41AM
షర్మిల రావాలి. తమ సమస్యలు తీర్చాలి. ఇది అమరావతి రైతుల డిమాండ్. 2019 ఎన్నికల్లో మా అన్నకి ఓటేయండి.. రాజన్న రాజ్యం వస్తుందంటూ ఏపీలో ఊరూరా ప్రచారం చేశారు షర్మిల. తీరా ఎన్నికల్లో జగనన్న గెలిచాక.. రాజన్న రాజ్యం కాదు రావణ రాజ్యం వచ్చిందంటున్నారు రైతులు. మరి, ఆనాడు ఎన్నికల్లో ఓటేయమని అడిగిన ఆ చెల్లెమ్మ.. ఇవాళ ఏకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయారు. తాను తెలంగాణ బిడ్డనంటూ పక్క రాష్ట్రంలో సెటిలయ్యారు. ఇప్పుడు అక్కడా సేమ్ డైలాగ్. తనను ఆదరించండి.. రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ ఊదరగొడుతున్నారు. తెలంగాణ సంగతి తర్వాత.. ముందు ఏపీలో మీరు చెప్పిన రాజన్న రాజ్యం ఎక్కడొచ్చిందో చూపించమంటూ అడుగుతున్నారు అమరావతి రైతులు. జస్ట్ అడగడమే కాదు.. తమకు మద్దతుగా ఏపీలోనూ పోరాడాలని కోరుతున్నారు అక్కడి మహిళలు. ఆ రోజు మీరే కదా రాజన్న రాజ్యం వస్తుందని ఓటేయమన్నారు? ఇప్పుడు అదే రాజన్న రాజ్యం కోసం మా పక్షాన పోరాడమంటూ అమరావతి మహిళా రైతులు ఓ వీడియో రిలీజ్ చేశారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షర్మిల కమిట్‌మెంట్‌పై చర్చ మొదలైంది.
నిరుద్యోగ సమస్యపై ఇటీవల షర్మిల చేసిన దీక్ష పై అమరావతి మహిళా జేఏసీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముచ్చటగా మూడు రోజులు దీక్ష చేసి ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేస్తున్న షర్మిలకు.. దాదాపు 500 రోజులుగా దీక్ష చేస్తున్న అమరావతి మహిళలు వారి కళ్లకు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా వైఎస్ విజయమ్మపైనా ప్రశ్నల వర్షం గుప్పించారు. విజయలక్ష్మిని గాంధారితో పోల్చారు అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ. ఆ గాంధారి తన భర్త చూడని లోకం తాను చూడనని కళ్లకు గంతలు కట్టుకుంటే.. ఈ విజయమ్మ తన పిల్లలు చేస్తున్న అరాచకాలు కళ్లుండి చూడలేని గాంధారిలా మారారని విమర్శించారు.
షర్మిల దీక్ష భగ్నం సందర్భంగా పోలీసుల దురుసు ప్రవర్తన, జాకెట్ చినగడంపైనా సెటైర్లు వేశారు అమరావతి మహిళలు. ‘‘అమరావతి మహిళలను పోలీసులతో మీ కొడుకు రక్తం వచ్చేలా కొట్టిస్తే ఎక్కడున్నవమ్మా విజయమ్మ? షర్మిల ఒక్కరేనా మహిళ? అమరావతి మహిళా రైతులు మహిళలు కాదా? కడుపుతీపి మీ ఒక్కరికే ఉంటుందా? వైజాగ్ ఎంపీగా పోటీ చేసిన మీరు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తుంటే నోరు మెదపడం లేదు ఎందుకు? జగన్‌కి ఒక్క అవకాశం ఇవ్వండి అని ఊరు వాడా తిరిగిన మీరు, షర్మిల ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అని నిలదీశారు. అన్న ఏపీని నాశనం చేస్తుంటే.. చెల్లి తెలంగాణను నాశనం చేయడానికి సిద్ధమవుతున్నారు. విజయమ్మ, జగన్, షర్మిల కలిసి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును బ్రష్టు పట్టిస్తున్నారు’’ అని ఘాటుగా విమర్శించారు అమరావతి మహిళా రైతులు.
2019లో ఏపీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు షర్మిల. జగనన్న కోసం అనేక నియోజకవర్గాలు పర్యటించారు. అన్నను గెలిపించారు. కట్ చేస్తే.. రెండేళ్లు గడిచే సరికి ఏకంగా రాష్ట్రం నుంచే పరార్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో కొత్త దుకాణం తెరిచారు. అక్కడా రాజన్న రాజ్యమేనట. వేరే ఎజెండా లేదట. ఏపీలో ఇన్నాళ్లూ జగనన్న కోసం పని చేసినట్టు.. ఇకపై, వచ్చే మూడేళ్లలో పరోక్షంగా కేసీఆర్ కోసమో.. బీజేపీ కోసమే పని చేయడం పక్కా అని అనుమానిస్తున్నారు. ఆ ఎన్నికలు ముగిశాక.. ఆ ఇద్దరిలో ఒకరికి అధికారం కట్టబెట్టాక.. మళ్లీ అన్న కోసం ఆంధ్రప్రదేశ్ తిరుగొస్తారని అంటున్నారు.
ఎందుకంటే, తిరుపతి ఎన్నికలతో ఇప్పటికే టీడీపీ బాగా బలం పుంజుకుంది. వైసీపీ పాలనతో ప్రజలు విసిగి పోయారు. ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబు మరింత బలపడతారు. అప్పుడు జగనన్న గెలవడం అంత సులువు కాదు కాబట్టి అన్న కోసం చెల్లమ్మ మళ్లీ ఏపీలో వాలిపోతుందని ఊహిస్తున్నారు. ఎందుకంటే, 2019లో ఏపీలో రాజన్నరాజ్యం కావాలన్న షర్మిల, 2021 కల్లా ఆంధ్రప్రదేశ్‌లో జెండా ఎత్తేసి.. తెలంగాణలో కొత్త జెండా పాతేశారు కాబట్టి ఆమె చిత్తశుద్ధిపై ప్రజలకు నమ్మకం లేదని స్పష్టం చేస్తున్నారు అమరావతి మహిళా రైతులు. ముందు ఏపీకి వచ్చి తమ తరఫున పోరాడి.. తమకు న్యాయం చేసి.. ఇక్కడ రాజన్న రాజ్యం తీసుకొచ్చాక.. ఆ తర్వాత తెలంగాణలో ఏమైనా చేసుకోండి మీ ఇష్టం అంటున్నారు అమరావతి ప్రజలు.