వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు!
posted on Apr 19, 2021 @ 12:02PM
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ జల్లాలో రంగురాళ్ల కోసం అక్రమ తవ్వకాలు జరపడం కలకలం సృష్టిస్తోంది. వైసీపీ నేతలు ఖనిజ సంపదను లూటీ చేస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో
అక్రమ తవ్వకాల బాగోతం బయటపడింది.
విశాఖ జిల్లా గొలుసుకొండ మండలం, సాలిక మల్లవరం సమీపంలో రిజర్వుడ్ ఫారెస్టులో వైసీపీ నేతలు జేసీబీలతో అలెగ్జాండర్ రైట్ రంగురాళ్ల కోసం తవ్విన అక్రమ సొరంగ మార్గాలు బయటపడ్డాయి. వైసీపీ కౌన్సిలర్లుగా పోటీ చేసిన తమరాన శ్రీను, ఉండా భాస్కర్ ఈ తవ్వకాలు జరిపినట్లు సమాచారం. ఈ ఇద్దరూ స్థానిక ఎమ్మెల్యే గణేష్‌కు ప్రధాన అనుచరులుగా ఉన్నట్లు సమాచారం.
విశాఖ రంగురాళ్ల అక్రమ తవ్వకాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం నవరత్నాలని చెబుతూ.. ప్రజల కళ్లుగప్పి మాయ చేస్తుంటే.. ఇదే అదనుగా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఇసుక, మట్టి, ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నేతలు.. తాజాగా రంగురాళ్లు కూడా దోచుకునేందుకు సిద్ధమయ్యారని లోకేష్ ఆరోపించారు. విశాఖజిల్లాలోని గొలుగొండ మండలంలో నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు జరుపుతున్న తవ్వకాలను గురించి తెలిపారు.
సాలికమల్లవరం రిజర్వ్ ఫారెస్టులో జేసీబీలతో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. అటవీ సిబ్బందిని కూడా బెదిరిస్తున్నారంటే ఎంత బరి తెగింపో చూడండని వాటికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు. వైసీపీ నేతలు తమ స్వార్థం కోసం చిన్నారులతో అడవుల్లో ప్రమాదకరమైన సొరంగాలు తవ్విస్తున్నారని.. ఇది వారి క్రూరత్వానికి నిదర్శనమన్నారు. ఆ పిల్లలకు ఏమైనా జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు. ‘‘ఒకవైపు అక్రమ తవ్వకం, మరోవైపు మైనర్ల ప్రాణాలతో చెలగాటం.. ఈ నేరాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు’’ అని నిలదీశారు. రంగురాళ్ల అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం స్పందించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.