కుమార్తె పెళ్లి కి రెడీ.. తండ్రి మృతి..
posted on Apr 30, 2021 @ 1:35PM
కుమార్తె పెళ్లికి ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఇంతలోనే కరోనా రూపంలో మృత్యువు ఇంటి పెద్దను కబళించిన సంఘటన ఉప్పల్‌లో చోటు చేసుకుంది. ఉప్పల్‌లోని భరత్‌నగర్‌కు చెందిన ఈగ నర్సింగ్‌రావు ముదిరాజ్(48).. ఉప్పల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మే 13న కుమార్తె వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఐదారు రోజుల క్రితం నర్సింగ్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం రాత్రి ఆరోగ్యం విషమించడంతో..మరో ఆసుపత్రిలో చేర్పించేందుకు అంబులెన్స్‌లో తీసుకొని బయలుదేరారు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా పడకలు లేవనే సమాధానమే వచ్చింది. రాత్రంతా ప్రయత్నించినా ఏ ఆసుపత్రిలోనూ ఆయన్ను చేర్చుకోలేదు. చివరకు తీసుకెళ్లిన అంబులెన్స్‌లోనే తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.
పెళ్ళికి 300 మంది. తల్లిదండ్రులపై కేసు నమోదు..
కరోనా నిబంధనల్ని పట్టించుకోకుండా వివాహానికి 300 మందిని ఆహ్వానించి, వివాహ విందును నిర్వహించిన ఉదంతమిది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెంటూరులో ఏర్పాటైన ఈ వేడుకకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో 50 మందికి మించకుండా వేడుకల్ని నిర్వహించుకోవాలని నిబంధనలు విధించారు. వీటిని పట్టించుకోకుండా పెళ్లి వేడుకకు 300 మంది హాజరయ్యారు. విషయం వాట్సప్ ద్వారా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై నివేదిక పంపాలని రామచంద్రపురం ఆర్డీవో గాంధీని జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అధికారులు విచారణ జరిపారు. విందు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీఆర్వో శాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడి తండ్రి సురేష్‌బాబు, వధువు తండ్రి వెంకటేశ్వరరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు.