కుక్కని పట్టిన పోలీసులకు ఇంగ్లీషు రాదు!
posted on Jul 18, 2022 @ 6:06PM
దొంగనో, ఖూనీకోరునో పట్టుకుంటే పోలీసులు వారికి అర్ధమయ్యే తిట్ల భాషలోనే మాట్లాడుతూ కొడుతూ సమాచారం సేకరించడం ఆనవాయితీ. కానీ బీహార్ బక్సార్ పోలీసులకు పెద్ద సమస్యే వచ్చిపడింది. వాళ్లు ఒక కేసుకి సంబంధించి జర్మన్ షెపార్డ్ కుక్కను పట్టుకున్నారు. కానీ వీళ్ల ఆదేశాలు దానికి అర్ధం గాక వెర్రిగా చూస్తూండిపోయింది. సంగతేమిటంటే దానికి ఇంగ్లీషులో ఆదేశాలు వినడం అలవాటయి మరే భాషలో చెప్పినా అర్ధంకాదు. దానికీ ఇంగ్లీషు వ్యామోహమే అని తలలు పట్టుకున్నారు బక్సార్ పోలీసులు.
ఇటీవల బీహార్ బక్సార్ ప్రాంత పోలీసులు ఎక్సైజ్, ప్రొహిబిషన్ చట్టం అతిక్రమించిన వ్యక్తుల్ని ఒక కారుతో సహా పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ నుంచి వస్తున్న ఒక కారును పాట్నాకు వంద కిలోమీటర్ల దూరంలో అనుమానించి పోలీసులు నిలిపారు. అందులో భారతదేశంలో తయారవు తున్న విదేశీ మద్యం ఆరు బాటిల్స్ దొరికాయి. కారులో సతీష్‌కుమార్, భువనేశ్వర్ యాదవ్ అనే ఇద్దరు అప్పటికే కూటుగా తాగి వెనకసీట్లో పడి వున్నారు. వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కోర్టుకి తీసికెళితే జైలు శిక్ష విధించారు.
అయితే ఆ కారుతో పాటు జర్మన్ షెపర్డ్ ని పోలీసులు పట్టుకున్నారు. దాని ద్వారా తాగుబోతుల ఇద్దరి గురించి సమాచారం తెలుసుకోవడానికి విశ్వయత్నం చేశారు కానీ ఫలించలేదు. పైగా పోలీసులు ఏది చెప్పడానికి ప్రయత్నించినా అది మొహం తిప్పేసుకంటోందిట. చివరికి దానికి ఇంగ్లీషు ఆదేశాలే అర్ధ మవుతాయన్నది పాపం బీహార్ పోలీసులకు ఆలస్యంగా తెలిసింది. పైగా దానికి కార్ణ్ ఫ్లాక్స్, బిస్కెట్లు, పాల ఖర్చులు ఎక్కువయ్యాయని పోలీసులు గోడు పెడుతున్నారు.
ఇపుడు దానితో ఇంగ్లీషులో మాట్లాడే వారి కోసం వెతుకుతున్నారు. చిత్రంగా వుందిగదా? ఆ కుక్కని పెంచినవారు దానికి ఆంగ్లం అలవాటు చేయడం, అది పోయి పోయి పక్కా హిందీ, బీహారీ భాషల ప్రాం తంలో పట్టుబడటం దాని తప్పుకాదేమో! కానీ మీ కుక్కపిల్లలకు మాత్రం కనీసం తెలుగు ఆదేశాలు అర్ధమయేలా చేయండి. ఎక్కడన్నా తప్పిపోయినా చెవులో, తోకో ఆడిస్తుంది.. సింబాలిక్ గా!