తిట్టించుకోండి.. గడపగడపకూ తిరగండి!
posted on Jul 18, 2022 @ 5:23PM
గడప గడపకూ వెళ్లి మా పాలన గురించి వాకబు చేయండి అని పూర్వం రాజులు వేగులను పంపేవారు. అప్పట్లో ప్రజల శ్రేయస్సే వారి పాలనకు గీటురాయి. వాళ్లు ఏమన్నా వేగులు అదే మాటను రాజుగారి చెవిలో వేసేవారు. రాజుగారు పొరపాట్లను సరిదిద్దుకునేవారు. ఆ కాలం పోయింది. రాజుల్లా పాలిస్తున్నా మనుకునే ఆధునిక పాలకులకు ఆదేశాలివ్వడం తప్ప వినడం ఉండదు, లేదు.
ప్రజలకు తమ పనులు తెలియజేయడం, మొట్టికాయలు వేయడం తప్ప వాళ్ల గోడు, నినాదాలు పట్టవు. మంత్రులను పురమా యిస్తున్న ప్రభువుకు ప్రజల తిట్ల దండకమే మోహనరాగం! తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తీరు ఇలా వుంది. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు, ఫలితాలను ప్రచారం చేయమని మంత్రులను, ఎమ్మెల్యేలను సీఎం పంపుతున్నారు. కానీ వెళ్లినవారికి దాదాపు అందరికీ అవమానాలు, తిట్లు తప్ప టిఫిన్ పెట్టి అంతా బాగుండావన్నా .. అన్న వారు ఒక్కరు లేరు. అయినన్ పోవలే అని జగన్ మళ్లీ తరుముతున్నారు. సమీక్షా సమావేశం పేరుతో అందర్నీ పిలిచి ఆ తిట్లేవో వాళ్ల నోటినే వినాలని జగన్‌కి ఎంత సంబరమో! లక్షలు తగలేసి ఓట్లేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలు రాజుల్లాగా నియోజకవర్గాల్లో తిరగాలి. కానీ ఇలా భయం భయంగా వెళ్లి జగన్ భజనలు చేయగానే వింటున్న నలుగురైదుగురూ విసుక్కుంటున్నారు. నొసలతో వెక్కిరిస్తున్నారు.. కొన్ని ప్రాంతాల్లో నోరూ చేసుకుంటున్నారు.
ఇంత కంటే కేవలం పాంప్లెట్లు పంచి ఇంటికి వచ్చేస్తే సరిపోద్దిగా అన్నా అనుకుంటున్నారు వెళ్లినవారు. అలాంటి పరిస్థితిని ప్రభుత్వ మే కోరి తెచ్చుకుంది. పాలన కాలం మూడేళ్లు అయిపోయినా ఇంతవరకూ చాలా బావుంది జగనన్నా.. అన్నవారు పులివెందుల్లో కూడా లేకపోవడం విడ్డూరమే. కానీ వాస్తవం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్షాలను తిట్టిపోయడం, వెక్కిరించడం తప్ప ప్రత్యేకించి చేసిదేమీ లేదన్నది ప్రజలు గమనించారు. కేవలం పథకాలు ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా వాటి ఫలాలు అందరికీ అందుతున్నాయా అంటే అనుమానమే. అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారే అందరూ.
పోనీ రాజకీయంగా చూసుకున్నా, ప్రత్యేక రాష్ట్ర హోదా, ప్రాజెక్టులూ పూర్తి చేస్తాననీ, కేంద్రం నుంచి రావాల్సిన వాటిని సాధిస్తా నని ప్రగల్భాలు పలికి ఓట్లేయించుకున్న జగన్ ఆ తర్వాత చప్పబడ్డారు. కేంద్రంలో బిజెపి నాయకులతో సంప్రదించి తాడో పేడో తేల్చుకుంటానని వెళ్లిన ప్రతిసారీ చక్కగా ఫోటోలు తీయించుకోవడానికే పరిమిత మయ్యారన్నది బహిరంగ రహస్యమైపోయింది. కారణం ఆయన ఒక్క మాటా వారి భేటీల గురించి పెదవి విప్పకపోవడమే.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రజలను నేరుగా వారి ఇంటి వద్దనే కలిసి బాగోగులు తెలుసుకోవాలన్న ఆలోచన అమలు చేశారు. కానీ పథకం ఆలోచనా పేరు బాగానే వుంది.. గడప గడపకూ అంటూ. కానీ వెళ్లిన ప్రజాప్రతినిదులు ఎవరూ సరయిన ఆదరణకూ నోచుకోవడం లేదు. వీరి మాటలు వినడానికి ఏ ప్రాంతంవారూ బొత్తిగా సిద్ధంగా లేకపోవడమే విడ్డూరం. ఇక వెళ్లడం దేనికి? కానీ ఎమ్మెల్యే లు, మంత్రుల పరిస్థితి తెలిసినా తెలియనట్టు వ్యవహరించి తిరిగి వచ్చిన వారి గ్రాఫ్ ను పరిశీలించచడం హాస్యాస్పదంగా మారింది. మళ్లీ అలా వెళ్లిరండి అంటూ తరమడానికే సమావేశాలు పెట్టి జగన్ వారిని ఒత్తిడి చేయడం చూస్తున్నాం.
కాగా అలా వెళ్లినవారు ఎంతగా అవమానాలు ఎదుర్కొంటున్నారనడానికి తాజా ఉదాహరణ పెనుకొండ మండలం శెట్టిపల్లి తండాలో శనివారం జరిగింది. పెనుకొండ మండలం శెట్టిపల్లి తండాకు అధికారులు, పార్టీ నాయకులతో కలిసి మంత్రి శంకర నారాయణ గడపగడపకు కార్యక్రమం నిర్వహిం చారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్లారు. ఈ క్రమంలో లలితా బాయి అనే మహిళ ఇంటి వద్దకు చేరుకోగానే ఆమె బంధువులు పింఛన్ రద్దు విషయాన్ని ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఇంతలో లలితా బాయి అనే మహిళ బయటకు వచ్చి తన భర్త ఆనందనాయక్ పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, అప్పటి నుంచి తనకు వితంతు పింఛన్ వచ్చేదని తెలిపింది. స్థానిక వైసీపీ నాయ కులు తనకు పింఛన్ రాకుండా చేశారని, 11 నెలల నుంచి పింఛన్ అందడంలేదని ఎమ్మెల్యేకి వివరిం చింది. అంతా విన్న ఎమ్మెల్యే, తరువాత చూద్దాంలే.. అని చెప్పి, తేలిగ్గా తీసుకుని ముందుకు వెళ్లి పోయా రు.
దీంతో లలితా బాయి రగిలి పోయింది. ఏమిచ్చి పోగొట్టుకున్నారని మా ఇంటికాడికి వచ్చినార్రా.. ఇంకో సారి మా ఇంటి ముందుకొస్తే చెప్పుతో కొడతా. ఒకసారి మా ఇంటిని చూడండిరా..అని ఆగ్రహం వ్యక్తం చేసింది. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడికి రా.. అని ఎమ్మెల్యేపై తొడ కొట్టి సవాల్ చేసింది. ఇంతకంటే వైసీపీ నాయకులకు వేరే అవమానం ఉంటుందా? జగన్‌కి వీరి మనోవేదన ఇంకా ఎప్పుడు తెలుస్తుంది.