ఆ నిధులు వెనక్కు ఇచ్చేయండి.. జగన్ సర్కార్ కు సుప్రీం ఆదేశం
posted on Jul 18, 2022 @ 5:47PM
కేసు ఏదైనా, విషయం ఏదైనా కోర్టుల్లో ఏపీ ప్రభుత్వానికి అక్షంతలు తప్పడం లేదు. అంటే జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ జీవో జారీ చేసినా అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించేదిగానే ఉంటోందని తేటతెల్లమౌతోందని పరిశీలకులు అంటున్నారు. తాజాగా కోవిడ్ నిధులను ఎస్డీఆర్ఎఫ్ నుంచి పీడీ (పర్సనల్ డిపాజిట్లు)లకు మళ్లించడాన్ని సుప్రీం తప్పుపట్టింది. ఆ నిధులను తక్షణమే అంటే రెండు రోజులలోగా తిరిగి ఎస్డీఆర్ఎఫ్ కు మళ్లించాలని సుప్రీం కోర్టువిస్పష్ట ఆదేశాలను ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. కోవిడ్ సమయంలో స్టేట్ డిజార్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) నిధులను వ్యక్తిగత ఖాతాలకు (పర్సనల్ డిపాజిట్) మళ్లిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పు బట్టింది. ఆ నిధులను రెండు రోజుల్లోగా తిరిగి ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలకు జమ చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్డీఆర్ఎఫ్ నిధులను ప్రభుత్వం వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ ఎమ్.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్న ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనంఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అర్హులైన వారికి పరిహారం చెల్లించకపోవడం, కొంతమంది దరఖాస్తులు తిరస్కరించడం వంటి అంశాలపై కూడా ధర్మాసనం స్పందించింది. ఎవరైనా పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే, దీనికోసం ఏర్పాటైన కమిటీ నాలుగు వారాల్లోనే పరిహారం అందజేయాలని ఆదేశించింది.
అర్హులైన వారికి పరిహారం అందించడంలో సమయం వృథా చేయకూడదని, పరిహార కమిటిని ఆశ్రయిస్తే వెంటనే పరిష్కరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్ని ప్రభుత్వం పర్సనల్ డిపాజిట్లను మళ్లించడం నిబంధనలకు విరుద్ధమని పల్లా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాల కోసం కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు వాడుకోవడం సరికాదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల ఏపీ ప్రభుత్వ న్యాయవాది సమ్మతం తెలిపారు. నిధులు వెనక్కి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అయితే, ఇంకా కొన్ని కరోనా బాధిత కుటుంబాలకు సాయం అందాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి విన్నవించుకోగా, ఆ విషయం పరిష్కార కమిటీకి నివేదించాలని స్పష్టం చేసింది.
కరోనాతో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు కేటాయించిన సొమ్ములోంచి ఏపీ సర్కారు రూ.1,100 కోట్లు దారిమళ్లించిందంటూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అప్పట్లో దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఏపీ సీఎస్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోనూ ఏపీ ప్రభుత్వంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.