ఆడలేక మద్దెలు ఓడు!
posted on Jul 19, 2022 7:49AM
ఏపీలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమైనా, జనం అష్టకష్టాలూ పడుతున్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదనీ, పట్టించుకోవడం లేదనీ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మంత్రి అంబటి మాత్రం తమ ప్రభుత్వం వరద సమయంలో అద్భుతంగా పని చేసిందనీ, ప్రాణ నష్టాన్ని నివారించగలిగిందనీ చెబుతున్నారు. పోలవరం కాపర్ డ్యాం ఎత్తు పెంచి వందలాది మంది ప్రాణాలను కాపాడిన ఘనత మాదేనని చెబుతున్నారు.
ఇక ముఖ్యమంత్రి జగన్ అయితే వరద బాధితులకు రేషన్ తో పాటు రెండు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఇంత వరకూ తమది మాత్రమేనని చెప్పు కుంటున్నారు. ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రుల ప్రకటనల సంగతి ఎలా ఉన్నా క్షేత్ర స్థాయిలో ప్రజలు మాత్రం వరద ముంపునకు గురైన తమను ప్రభుత్వం తమ ఖర్మకు తమను వదిలేసిందని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నిరసన సెగలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే జగన్ మాత్రం ప్రజా నిరసనల గురించి ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.
అసలు ఎమ్మెల్యేలు తాను ఆదేశించినా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఓ 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారనీ, మిగిలిన వారు అసలు పట్టించుకోనే పట్టించుకోవడం లేదనీ ఆగ్రహవం వ్యక్తం చేస్తున్నారు. గడప గడపకూ కార్యక్రమంపై సోమవారం సమీక్షించిన జగన్ ఎమ్మెల్యేల తీరుపై తవ్ర అసహనం వ్యక్తం చేశారు.
గడప గడపకూ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. పని తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లకు గడపగడపకూ కార్యక్రమమే గీటురాయని జగన్ స్పష్టం చేశారు. పని తీరు మార్చుకుని ప్రజల్లోకి వెళ్లిన వారికే టికెట్లని జగన్ స్పష్టం చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. గడప గడపకూ కార్యక్రమంలో జనం సమస్యలపై నిలదీస్తున్నారని చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో వర్క్ షాప్ నిర్వహించిన సందర్భంగానే చెప్పేశారు. అప్పట్లో రూ.2 కోట్లు విడుదల చేస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఇది జరిగి మూడు నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.
అసలు లోపం తన దగ్గర పెట్టుకుని మా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏం లాభమని సమీక్షా సమావేశంలోనే పలువురు ఎమ్మెల్యేలు గొణుక్కున్నారని సమాచారం. ఆడలేక మద్దెలు ఓడు అన్న చందంగా నిధులు విడుదల చేయకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేయండి అంటూ ఆదేశాలు జారీ చేసి.. మళ్లీ అవి పరిష్కారం కావడం లేదని చిటపటలాడటమేమిటని ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో మధన పడుతున్నారు. మీట నొక్కేసి అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నానని గప్పాలు కొట్టుకుంటే సరిపోదనీ, క్షేత్ర స్థాయిలో పథకాల కోతలపై జనంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాగ్నిని గమనించాలని ఎమ్మెల్యేలు అంటున్నారు. అయతే ఈ విషయాన్ని నేరుగా అధినేతకు చెప్పేదెలా అని మధన పడుతున్నారు. బెజవాడ కార్పొరేషన్ నిధుల గురించి కొందరు అడిగితే అవే వస్తాయిలే అని తేలిగ్గా కొట్టిపారేయడాన్ని ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
మంత్రి శంకరనారాయణను నిలదీసిన మహిళపై మద్యం కేసు పెట్టడమేమిటని కూడా పలువురు ఎమ్మెల్యేలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. సమస్యపై నిలదీసినప్పుడు దానిని పరిశీలించి పరిష్కరించాల్సినది పోయి కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజలలో మరింత పలుచన కావడం ఖాయమని వారు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. జగన్ చెప్పినట్లు ఇంక 14 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికైనా అధినేత తీరు మారకపోతే.. ఆయన టిక్కెట్లు ఇవ్వకపోవడమే ఎమ్మెల్యేలే మహద్భాగ్యంగా భావించే పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.