జగన్ సర్కార్ కు ఇక దబిడి దిబిడే.. తప్పుడు కేసులపై పోరాటానికి న్యాయాధికారుల ఫోరం!
posted on Jul 19, 2022 6:30AM
జగన్ కు సొంత పార్టీ ఎంపీ నుంచి ఎదురౌతున్న సెగ ఇంతింత కాదు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వదిలేదే అంటూ జగన్ సర్కార్ తప్పిదాలనూ, పరిమితికి మించి తీసుకున్న అప్పులను ప్రశ్నిస్తూనే ఉన్నారు. కేసులు పెట్టినా, సీఐడీ పోలీసులు భౌతికంగా హింసించినా ఆయన తగ్గడం లేదు. పైపైచ్చు మరింత స్పీడుగా ముందుకు సాగుతున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య క్విడ్ ప్రొకొ అన్నట్లుగా ఇంత కాలం సాగిన హనీమూన్ పిరియడ్ కు ఇక తెరపడిందని అన్నారు.
నాకు మద్దతు కావాలి.. నీకు అప్పులు కావాలి. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మోడీ సర్కార్ ఏ ఒక్క అవకాశాన్నీ వదులు కోకూడదన్న రీతిలో వ్యవహరించడం వల్ల ఏపీలో జగన్ సర్కార్ విషయంలో చూసీ చూడనట్టు వదిలేసిందా?, ఒక విధంగా క్విడ్ ప్రోకొ అన్న చందంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాయా? అంటే వైసవీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఔననే అంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక అయిపోయింది కనుక ఇక ఏపీలోని జగన్ సర్కార్ కు ఇక దబిడి దిబిడేనని వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజు అన్నారు. ముందు ముందు అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కార్ పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాజ్యాంగ విరుద్ధంగా లిక్కర్ కార్పొరేషన్ పేరిట ఇప్పటికే 8500 కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నారని, మరో రెండు వేల కోట్ల రూపాయలను తీసుకోబోతున్నారని తెలిపారు. రాష్ట్రం కేంద్రం విధించిన 28 వేల కోట్ల రూపాయల రుణ పరిమితిని మించి ఇప్పటికే 38 500 కోట్ల రూపాయల రుణాలు తీసుకుందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలా?, వెళ్ళక్కర లేదా? అన్న పిటీషన్ పై వాదనలు ముగిసి ఇప్పటికే 200 రోజులు గడుస్తున్నదని చెప్పారు. అయినా కోర్టు ఇంకా తీర్పు వెలువరించలేదని, ఒకవేళ తీర్పు అంటూ వస్తే… జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరుకావాలనే వస్తుందని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.
కోర్టు హాజరై, నిలబడవలసి వస్తుందని అన్నారు. వ్యవస్థలన్నింటిని చాలా వరకు మ్యానేజ్ చేస్తున్నారని, కోర్టుకు వెళ్లాలా ?వద్దా? అన్న విషయాన్ని హైకోర్టు చెప్పదని, దర్యాప్తు సంస్థ ప్రశ్నించదని రఘురామ అన్నారు. తాను వేసిన బెయిల్ రద్దు పిటిషన్ వాదనలు ముగిసి కూడా 200 రోజులైందన్న ఆయన, పిటిషన్ స్వీకరిస్తారా?, కొట్టివేస్తారా?? అన్నది ఇంకా తేల్చి చెప్పలేదన్నారు. హైకోర్టులో కొట్టివేస్తే, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. హైకోర్టులో ఈ ఆర్డర్ పెండింగ్ లో ఉందని, సిబిఐ కొట్టేసిందన్నారు. సిబిఐ కోర్టు , దర్యాప్తు సంస్థ… జగన్మోహన్ రెడ్డి , కోర్టు కు ఎందుకని హాజరు కావడం లేదని ప్రశ్నించడం లేదని అన్నారు.
తన పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరించిన జగన్ సర్కార్ శారీరకంగా హింసించి, భౌతికంగా లేకుండా చేయాలని చూశారనీ, ఏ మాత్రం నిలబడని చెత్త కేసులు పెట్టారని ఆయన అన్నారు. తన ఇంటి వద్ద, రెక్కీ నిర్వహిస్తూ అనుమానాస్పదంగా కనిపించిన పోలీస్ కానిస్టేబుల్ ను, తన రక్షణ సిబ్బంది గా ఉన్న సిఆర్పిఎఫ్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులకు అప్పగించారన్నారు. అయితే సిగ్గు లేకుండా జగన్ మోహన్ రెడ్డి తనపై తప్పుడు కేసులను పెట్టించి, సిఆర్పిఎఫ్ అధికారులతో మాట్లాడి తన రక్షణ సిబ్బంది గా ఉన్న ఇద్దరిని తాత్కాలికంగా సస్పెండ్ చేయించారని చెప్పారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారన్నారు. సిబిఐ అధికారి రాంసింగ్ విషయములోనూ ఇదే టెక్నిక్ ను ఉపయోగించే అవకాశం లేకపోలేదు అన్నారు. కుదిరితే రామ్ సింగ్ సస్పెండ్ చేయించడం, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
మంత్రి శంకర్ నారాయణ గడప గడపకూ అంటూ విచ్చిన సందర్భంగా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన పాపానికి లక్ష్మీబాయిపై అనే మహిళపై తప్పుడు కేసు పెట్టారని రఘురామకృష్ణం రాజు అన్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన పింఛన్ ఇప్పుడు ఎందుకు తీసేశారని అడగడం తప్పా అని నిలదీశారు. ప్రభుత్వ పెద్దలు ఎప్పుడు కేసులను బనాయిస్తారొనన్న ఆందోళనలో ప్రజలు, ప్రతిపక్ష నేతలు ఉన్నారన్నారు. తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు న్యాయాధికారుల ఫోరం ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని రఘురామ కృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.ప్రధానమంత్రి హాజరవుతున్న సభకు ఆహ్వానం అందినా, స్థానిక ఎంపీకి ఆహ్వానం అందలేదన్న కారణంగా సభకు వెళ్లకుండా ఉండాలన్న నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు.