ప్రజా విశ్వాసం కోల్పోయిన జగన్ సర్కార్..!
posted on Jul 19, 2022 6:36AM
ఒక రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారనడానికి ఆ ప్రభుత్వం తన పథకాలను వివరించడానికి ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వాళ్లు నిలదీసే తీరులోనూ, ఏవైనా పనులకు టెండర్లు పిలిస్తే వాటికి వచ్చే స్పందనలోనూ.. ఇంకా చెప్పాలంటే ఆదాయం కోసం భూములు వేలానికి పెడితే కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంలోనూ తెలుస్తుంది. ఆ విధంగా చూస్తే ఏపీలోని జగన్ సర్కార్ పై జనాలు పూర్తిగా నమ్మకం కోల్పోయారనడానికి ఒకటి రెండూ కాదు వందల ఉదాహరణలు కనిపిస్తున్నాయి.
కాంట్రాక్టర్లు పనులకు టెండర్లు వేయడం లేదు. గతంలో చేసిన పనులకు సొమ్ముల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అంతెందుకు వైసీపీ నేతలు కూడా కనీసం చిన్న చిన్న పనులను నామినేషన్ కింద చేపట్టడాని కూడా ముందుకు రావడం లేదు. ఇఖ జగనన్న లే ఔట్లు అంటూ ప్రభుత్వం స్థలాలను అమ్మడానికి చూస్తుంటే వాటిని కొనడానికి సైతం ఎవరూ ముందుకు రావడం లేదు. మూడు రాజథానులలో ఒకటైన పాలనా రాజధాని అని చెబుతున్న విశాఖలోనే ప్రభుత్వ ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
జగనన్న లే ఔట్ల పేరుతో విశాఖలో రెండు వేల ప్లాటను జగన్ సర్కార్ వేలానికి పెట్టింది. ఇందుకోసం భారీగా ప్రచారం కూడా చేసింది. తీరా వేలం నిర్వహిస్తే కనీసం రెండు వందల మంది కూడా ఆన్ లైన్ లో అప్లై చేయలేదు. అలా దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి విడతగా కట్టాల్సిన డబ్బులు కట్టిన వారు కేవలం 70 మందే. జగనన్న లేఔట్ల పేర ప్రభుత్వం నేరుగా అమ్ముతున్నా జనం కొనడాగిని ముందుకు రాకపోవడం ఎలా చూసుకున్నా ఈ ప్రభుత్వంపై జనంలో విశ్వాసం లేదనే తేటతెల్లమౌతున్నది. ఎందుకంటే ప్రభుత్వమే విక్రయించే స్థలాలకు క్లియర్ టైటిల్ ఉంటుంది.
అదే సమయంలో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. భవిష్యత్ లో ఎలాంటి సమస్యలూ రావు. అని జనం భావిస్తారు. కానీ జగన్ సర్కార్ విక్రయానికి పెట్టిన లే ఔట్లను కొనుగోలు చేయడానికి జనం నుంచి స్పందన లేకపోవడమే ప్రభుత్వ విశ్వసనీయత ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్ధమౌతుంది. అదే గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే భారీ స్పందన వచ్చింది. గంటల వ్యవధిలోనే ప్లాట్లు మొత్తం అమ్ముడు పోయాయి.
జగన్ ప్రభుత్వం భూముల విక్రయానికి వేలం వేస్తే జనం కనీసం పట్టించుకోవడం లేదు. గడపగడపకూ మన ప్రభుత్వం, సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలకు ప్రజల నుంచి వచ్చిన స్పందన తెలిసిందే. ప్రజల్లో జగన్ సర్కార్ పలుకుబడి పూర్తిగా పడిపోయిందనడానికి ఇవే నిదర్శనాలని విపక్షాలు అంటున్నాయి. ఎప్పుడూ విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్ ఇప్పుడు తన సర్కార్ పైనే జనాలు విశ్వాసం కోల్పోయారనడానికి కనిపిస్తున్న తార్కానాలపై ఏం చెబుతారని ప్రశ్రిస్తున్నారు.