రేవంత్ టార్గెట్ గా మర్రి వ్యాఖ్యల అంతరార్ధం ఏమిటి?
posted on Aug 18, 2022 @ 10:39AM
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి బావిలో కప్పలా తయారైంది. బావిలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసిన ప్రతిసారీ.. ఓ రెండడుగులు వెనక్కులాగేలా అసమ్మతుల గళం వినిపిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీ మార్పు కలకలం సద్దుమణుగుతోందని అనుకునేలోగా మర్రి శశిథర్ రెడ్డి టీపీసీసీ తీరుపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం రేపాయి. సీనియర్లు అందరూ పథకం ప్రకారం రేవంత్ లక్ష్యంగా పావులు కదుపుతున్నారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా అనంతరం.. కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికకు అన్ని విధాలుగా సమాయత్తం అవుతోంది. మండలాల వారీగా ఇన్ చార్జ్ లను నియమించుకుని ఉపఎన్నిక కదన రంగంలోనికి పకడ్బందీగా దూకేందుకు సమాయత్తమౌతోంది. ఇందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక నుంచి కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి సోదరుడు, పార్టీ స్టార్ క్యాంపెయినర్ వెంకటరెడ్డిని పూర్తిగా దూరం చేశారు.
కోమటి రెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ చీఫ్ పై విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు, శ్రేణులకు పార్టీ హై కమాండ్ స్పష్టమైన సందేశం పంపించింది. ఇప్పుడు తాజాగా మర్రి శశిథర్ రెడ్డి టీపీసీసీ లక్ష్యంగా చేస్తున్న విమర్శలను చూస్తుంటే.. సీనియర్ నేతలంతా ఒకరి తరువాత ఒకరుగా రేవంత్ ను పార్టీలో బలహీనపరచడానికి పకడ్బందీ వ్యూహంతో అడుగులు కదుపుతున్నారా అనిపంచక మానదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఒక వెలుగు వెలిగి, పార్టీ పరంగా పదవులు, హోదా అనుభవించి పార్టీ అధికారంలో లేనప్పుడు సోదిలోకి కూడా కనిపించకుండా మాయమైన నేతలు ఒక్కొక్కరుగా తెలంగాణలో రేవంత్ లక్ష్యంగా గొంతు సవరించుకుంటున్నారా అని పించేలా వారి తీరు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటి వరకూ కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ పై చేసిన విమర్శలన్నీ ఒకెత్తు, తాజాగా మర్రి శశిథర్ రెడ్డి చేసిన విమర్శలు ఒకెత్తు అన్నట్లుగా ఉన్నాయి. ఆయన రేవంత్ నే కాకుండా పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై కూడా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ బయటకు వచ్చే పరిస్థితిలో లేరనీ, తన లాంటి వారెవరికీ కనీసం ఆయన అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వరనీ అన్నారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణికం ఠాకూర్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన టీపీసీసీ చీఫ్ పదవిని అమ్ముకున్నారనీ, రేవంత్ కు ఏజెంట్ గా పని చేస్తున్నారనీ దుమ్మెత్తి పోశారు. అయితే మర్రి శశిథర్ రెడ్డి వ్యాఖ్యలు, విమర్శలపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది.
ఇంత కాలం నోరు కట్టేసుకున్న నేతలు .. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ ఒకింత పుంజుకోగానే.. గొంతు సవరించుకుని పార్టీని మళ్లీ ఇక్కట్లలోకి నెట్టేలా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. ఇంత కాలం మౌనంగా ఉన్న వీరు అదే మౌనాన్ని కంటిన్యూ చేస్తే పార్టీకి మేలు చేసిన వారౌతారని అంటున్నారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కనీసం ఊహలో కూడా ఎవరూ తలిచే పరిస్థితి లేదు. అటువంటిది రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా బీజేపీని కాదు, కాంగ్రెస్ నే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. అటు బీజేపీ కూడా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరపతి రోజురోజుకూ తగ్గుతుంటే..ప తెలంగాణలో మాత్రం రోజు రోజుకూ బలపడుతున్న పరిస్థితి కనిపిస్తోందని భావిస్తోంది. ఆ కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ లక్ష్యంగానే వలసలకు తెరతీసింది. రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించడం, కొండా విశ్వేశ్వరరెడ్డ కమలం గూటికి చేరడం ఇందులో భాగమునని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలను కూడా తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద మర్రి వ్యాఖ్యలు వ్యాఖ్యలు ఏదో ఒక మేరకు కాంగ్రెస్ జోరుకు, రేవంత్ దూకుడుకు కళ్లెం వేయాలన్న లక్ష్యంతో చేసినవేనని విశ్లేషిస్తున్నారు.