ఆహార భద్రత కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి
posted on Aug 18, 2022 8:26AM
ఆహార భద్రత లబ్ధి దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త అందించింది. ఈ కార్డ దారులకు ఆరోగ్య శ్రీ సేవలను అందుబాబులోకి తీసుకు వచ్చింది. ఈ మేరకు తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆరోగ్యశ్రీ - ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే అన్ని ఉచిత వైద్య సేవలకు, చికిత్సలకు ఆహార భద్రత కార్డు హోల్డర్ ను అర్హులను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసిందన్నారు.
గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెల్ల రేషన్ కార్డుదారులకు ఆరోగ్య శ్రీ కార్డులు అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కోసం తెల్ల కార్డు స్థానంలో ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసింది. వీటిని కేవలం రేషన్ కు మాత్రమే పరిమితం చేశారు. ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్‌లో చికిత్సలు పొందాలంటే.. సంబంధిత కార్డులైనా ఉండాలి. లేదా తెల్ల రేషన్ కార్డు అయినా ఉండాలనే నిబంధనలున్నాయి.దీంతో ఆహార భద్రత కార్డు దారుల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం ఆహార భద్రత కార్డులను అందజేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో స్పందించి, ఆహార భద్రత కార్డు దారులకు కూడా ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని ఆదేశించారని హరీష్ రావు తెలిపారు. దీంతో ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులన్నీ ఇకపై ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులను కూడా ఉచిత చికిత్సలకు అనుమతిస్తాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్యశ్రీ పథకాలకు ఆహార భద్రత కార్డులను కూడా అర్హతగా పరిగణనలోకి తీసుకోనున్నట్టు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కూడా ప్రకటించింది.
ఈ మేరకు అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సమాచారం అందించిందని పేర్కొంది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ఆరోగ్యశ్రీ పథకాలను కలిపి ఒకే రూఫ్ కిందకు తీసుకువచ్చిన సంగతి సంగతి తెలిసిందే. ఆ ఆహార భద్రత కార్డు లేనివారు... రేషన్ కార్డుతోపాటు ఆధార్ కార్డును కూడా చూపించి ప్రయోజనం పొందవచ్చు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ బుధవారం ఓ ప్రకటన జారీచేసింది.