తెలుగుదేశంలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ తరహా ప్రక్షాళనకు చంద్రబాబు శ్రీకారం
posted on Aug 18, 2022 @ 11:56AM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారం అందుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో సైకిల్ పార్టీని అధికారంలోనికి చంద్రబాబు ఓ నిర్దుష్టమైన విధానాన్ని అవలంబించనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చంద్రబాబు నాయుడు అధ్యక్షతన చేపట్టిన బాదుడే బాదుడు, మినీ మహానాడులకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందనే వస్తోంది. ఈ నేపథ్యంలో ఓ వైపు వీటిని కొనసాగిస్తూనే.. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ అధికార వైసీపీతో అంటకాగుతోన్న కలుపు మొక్కలను ఏరిపారేయాలని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అసమ్మతి నేతలను బుజ్జగించి వారి మధ్య సమన్వయం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ వేళ వారు మారకుంటే శాశ్వతంగా వదిలించుకోనే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ముందు పార్టీలోని అసమ్మతి సెగపై నీళ్లు చల్లి.. ఆ తర్వాత జగన్ పార్టీపై దృష్టి సారించాలన్నదే చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.
అలాగే పార్టీలో ప్రస్తుతం సైలంట్ గా ఉన్న వారి కలిసి.. వారితో చర్చించాలని చంద్రబాబు నిర్ణయించారట. రానున్న ఎన్నికలను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఆ క్రమంలో గతంలో పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే.. వారిని దూరం చేసుకోవాలంటే చంద్రబాబు ఒకటికి రెండు సార్లు ఆలోచించి... ఆ తర్వాత చూద్దాంలే అంటూ ఓ విధమైన సాగతీత ధోరణితో ఉండేవారని.. కానీ అధికారం అందుకోవాలంటే.. ఆ మోహమాటాలు.. చూసి చూడనట్లు పోవడాలు... వగైరా వగైరా వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందని... ఇలాంటి ధోరణి వల్ల పార్టీనే కాదు.. లీడర్ నుంచి కేడర్ వరకు అందరు దెబ్బతింటారని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కఠిన వైఖరిని అవలంబించాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు.
ఇటీవల తిరుపతి అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీకి బలం ఉన్నా.. పార్టీలోని నేతల వెన్నుపోటుతో ఎంత నష్టం జరగాలో అంతా కళ్ల ముందే జరిగిపోయింది. దీనిని గుణపాఠంగా తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. అయితే ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఇప్పటికే సైకిల్ పార్టీ గుర్తించి.. పక్కన పెట్టిన పెట్టిన సంగతి తెలిసిందే.
అలాగే గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలక పదవులు అనుభవించి.. ప్రస్తుతం సైలెంట్‌గా మిగిలిపోయిన నేతల వైఖరిలో స్పష్టమైన మార్పు తీసుకు వచ్చేందుకు చంద్రబాబు నడుంబిగించారని చెబుతున్నారు
మరికొద్ది రోజుల్లో.. జిల్లాలోని పార్టీ అసమ్మతి నేతలతో వరుస భేటీలు జరిపేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారిందరిని ఒకే తాటిపైకి తీసుకు వస్తే.. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీని ఎదుర్కొవడం ఏమంత కష్టం కాదని చంద్రబాబు భావిస్తున్నారంటున్నారు. అలాగే ఎవరి వల్లనైనా తెలుగుదేశం పార్టీకి లాభం కలుగుతోందంటే.. వారిని సైతం చంద్రబాబు వెన్ను తట్టి మరీ ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు.
ఆ క్రమంలో ఇప్పటికే కడప, రాజంపేట లోక్‌సభ అభ్యర్థులతో పాటు పుంగనూరు, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థులను సైతం చంద్రబాబు ప్రకటించేశారు. చంద్రబాబు ఇలా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా.. ఆయా నియోజకవర్గాల్లోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరికీ స్పష్టమైన సంకేతాలు వెళ్తాయని.. వచ్చే ఎన్నికల్లో వాళ్లందరు.. టీడీపీ అభ్యర్థుల గెలుపునకు బాసటగా నిలుస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.