హిమాచల్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ పదవికి ఆనందశర్మ గుడ్ బై
posted on Aug 21, 2022 @ 5:55PM
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయమై పార్టీ అధినేత సోనియా గాంధీకి ఆయన ఆదివారం (ఆగస్టు 21) లేఖ రాశారు.
ఈ లేఖలో స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్న ఆనందశర్మ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పిన ఆనంద్ శర్మ.. స్టీరింగ్ కమిటీ నుంచి తప్పుకోవడం పట్ల పార్టీలోనే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. స్టీరింగ్ కమిటీ పదవికి రాజీనామా చేయడానికి కారణాలేమిటన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కానీ నవంబర్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన స్టీరింగ్ కమిటీ నుంచి తప్పుకోవడం మాత్రం కాంగ్రెస్ కు తేరుకోలేని దెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉండనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుండగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. బీజేపీ ఇప్పటికే ప్రచారంలోదూసుకుపోతుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన ఆప్.. ఇప్పుడు అదే ఉత్సాహంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాలు మోపేందుకు ఉత్సాహంతో ఉంది. ఎటు నుంచి ఎటు చూసినా ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీయే ప్రచారంలో కానీ, ప్రతిష్టలో కానీ వెనుకంజలో ఉంది.
గోరు చుట్టుమీద రోకలి పోటులా ఇప్పుడు ఆనందశర్మ స్టీరింగ్ కమిటీ నుంచి వైదొలగడం ఆ పార్టీకి మరింత నష్టం చేసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. గత ఏప్రిల్ నెలలో పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన ఆనందశర్మ ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేశారు. పార్టీ కంటే తనకు ఆత్మగౌరవమే ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అసమ్మతి వర్గంగా పేరొందిన జి-23లో జట్టులోని మరో మరో సభ్యుడు గులాం నబీ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ప్రచార కమిటీ చైర్మన్ పదవికి ఇటీవల గుడ్ బై చెప్పిన సంగతి విదితమే.
సంప్రదింపుల ప్రక్రియలో తనను విస్మరించారంటూ ఆనంద్ శర్మ సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆనందశర్మ గతంలో కేంద్రంలో మంత్రిగా పని చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఉప నాయకుడిగా ఉన్నారు.ఏప్రిల్ 26న హిమాచల్ ప్రదేశ్ లో స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. పార్టీ సమావేశాలకు చి ఆహ్వానం లేక పోవడం , ఏ విషయంలోనూ తనను సంప్రదించక పోవడంతో ఆనందశర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.