సెల్ఫీ, టిక్‌టాక్‌లకు నేపాల్ చెక్!
posted on Aug 22, 2022 @ 11:25AM
అదేమిటే ఆ పిల్ల మూతి అలా పెట్టేసుకుంది.. అని ఇంకా ఏదో అంటోంది అమ్మమ్మగారు. అది ఫోటో పోజులే.. అన్నది మనవరాలు. ఫోటోకి మొహం అలా చేసుకోవాలా అన్నది ఆమె లాంటి చాలామంది పెద్దవాళ్లకి ఇప్పటికీ ఉన్న అనుమానం. ఏమైనప్పటికీ సెల్ఫీలు, టిక్‌టాక్‌లు మోజు మహా పెరిగిపోయి, ఏకంగా సినిమాహాలుకి, దేవుడి గుడికి పెద్దగా తేడాలేకుండా చేస్తున్నారే అన్నది పెద్దావిడ. అదీ నిజమే. ఎక్కడికి వెళ్లినా ఠక్కున ఫోన్ తీయడం సెల్ఫీ తీసుకునే ప్రాంతం వెతుక్కోవడం తప్ప అక్కడికి ఎందుకు వెళ్లిందీ వాళ్లకి అక్కర్లేకుండా పోయింది. కోతికి కొబ్బరికాయలా ఇప్పుడీ టిక్‌టాక్ పిచ్చి ఒకటి. కేవలం టిక్ టాక్ కోసం పెద్ద పెద్ధ శబ్దాలతో ఇబ్బందులు కల్పిస్తున్నామన్న సెన్స్ బొత్తిగా ఉండటం లేదు. అందులో ఆనందం ఏమిటో గాని టిక్‌టాక్ క్రియేటర్స్‌గా స్నేహితుల్లో, బంధువర్గంలో కాలర్ ఎగరేసి తిరగడం ఈనాటి ఫ్యాషన్. కానీ వీరి పప్పులు నేపాల్ లో మాత్రం కుదరడం లేదు. అక్కడ నిషేధం విధించారు.
నేపాల్‌లో ప్రార్ధనా మందిరాలు, గుడికీ వెళ్లి మరీ టిక్‌టాక్ షోలతో యువత వాటి ప్రాధాన్యతను దెబ్బ తీస్తున్నారని అక్కడి ప్రభుత్వం భావించింది. అందుకే ఇటీవల కొన్ని పవిత్రస్థలాలను, గుళ్లకు టిక్ టాక్ క్రియేటర్ల ను రానీకుండా అడ్డుకుంటున్నారు. రామజానకీ దేవాలయం, లుంబినీ, ఖాట్మండులోని బౌద్ధ నాధ్ స్థూపం.. ఇలాంటి కొన్ని కీలక పర్యాటక ప్రదేశాలకు యువతను అస్సలు అంగీకరించడం లేదట. శాంతికి నిలయమైన ప్రాంతంలో పెద్ద పెద్ద శబ్దాలు, పాటలతో హోరెత్తించి ప్రతిష్టను దెబ్బ తీస్తు న్నారని ప్రభుత్వం భావించి టిక్‌టాక్ షోలు చేసేవారు, సెల్ఫీలు అతిగా తీసుకోనేవారిని దూరంగా పెట్టింది. వారికి ప్రభుత్వం, ప్రాంతీయ అధికారుల అనుమతి ఉంటేనే లోనికి రానీయాలని షరతు విధించింది.
నేపాల్ తీసుకున్నపాటి నిర్ణయం మనవాళ్లూ తీసుకుంటే బావుండును. మొన్నా మధ్య హనుమంతుడి విగ్రహం బావుందని పక్కనే నిలబడి సెల్ఫీ తీసుకున్నాడో ప్రబుద్ధుడు. అది గుడిలోనిది కాదు విడిగా ఒక గుట్టమీద ఎక్కడో తీసుకున్నది కాబట్టి జనం అంతగా ఆగ్రహం వ్యక్తం చేయలేదు. అసలు కుర్రాళ్లకి గుడి, దేవుడు, భక్తి అనేది పూర్తిగా అర్ధంలేని అంశాలుగానూ మారిపోయాయి. నలుగురు కలిస్తే వెంటనే సెల్ఫీ తీసి స్నేహలోకానికి పంపడం జన్మహక్కుగా మారిపోయింది. ఇది వారి ప్రవర్తనను, విద్యా సంస్కా రాన్ని తెలియజేస్తుంది.
దేనికయినా పరిమితి అంటూ ఉంటుంది. వీరి పిచ్చికి పరిమితి అనేది ఉండదేమో. అందుకే నేపాల్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. గతేడాది బాలీలో ఒక పవిత్ర వృక్షం క్రింద నగ్నంగా కూచుని ఒకా యన ధ్యానం చేస్తున్నాను, యోగా చేస్తున్నాననంటూ ఫోటో దిగి వారి దేశానికి పంపాడట! ఇలాంటి వేషా లేస్తేనే మరి ప్రభుత్వాలు, పోలీసులు గట్టి నిర్ణయాలు తీసుకోవడం, వీలయితే జైల్లో వేయడాలు చేయ గలరు. మరంచేత, కెమెరా ఉందని, చేతిలో మొబైల్ ఉందని ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు, టిక్ టాక్ లకు ధైర్యం చేయవద్దు అనేది తల్లిదండ్రులు పిల్లలకు చెబితే బావుంటుందేమో!