గుజరాత్ లో అధికారామే ఆప్ లక్ష్యం
posted on Aug 22, 2022 @ 10:15AM
గుజరాత్ లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పావులు కదుపుతోంది. ఇప్పటికే ఢిల్లీని దాటి పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన
ఆప్ త్వరలో గుజారాత్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో సత్తాచాటాలని భావిస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో అధికారాన్ని చేజిక్కించుకుంటే దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి తీసేసినట్లునని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలు సోమవారం (ఆగస్టు 22)న గుజరాత్ లో పర్యటించనున్నారు.
అహ్మదాబాద్ లోని హిమ్మత్ నగర్ లో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. మంగళవారం (ఆగస్టు 23)న భావ్ నగర్ లో పర్యటించనున్నారు. తమ రెండు రోజుల గుజరాత్ పర్యటనపై కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
విద్య, వైద్యానికి సంబంధించి గుజరాత్ ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే ఢిల్లీలో మాదిరే గుజరాత్ లో కూడా మంచి స్కూళ్లు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్ లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఆప్ కు అధికారం ఇస్తే గుజరాత్ లో ప్రతి ఒక్కరూ ఉచితంగా మంచి విద్య, వైద్యం పొందుతారని కేజ్రీవాల్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే ఈ రెండు రోజుల పర్యటనలో గుజరాత్ యువతతో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు.