బాబాను ఆశ్రయించాడు.. సస్పెండ్ అయ్యాడు!
posted on Aug 21, 2022 @ 3:50PM
జ్యోతిష్కులు, బాబాలంటే క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. వారి మాటే శాసనంగా మారింది. చాలామంది అనేక విషయాల్లో వారి సూచనలు, సలహాలు పాటించేస్తుంటారు. అదంతా నమ్మకంతో కూడిన పని. అలాగని మనం చేయదగ్గ పని కూడా బాబా దగ్గరికి వెళ్లి నేను ఇలా చేద్దామనుకుంటున్నాను, అయిపోద్దా సామీ.. అని అడగడం అన్యాయం. ఆయనేదో చెబుతాడు, మనం ఏదో వింటాం, అవతల అసలు పని కాబోతే కొంప అంటుకునేది మనదే!.. సరిగ్గా ఇలానే జరిగింది ఏఎస్ ఐ అనిల్ శర్మ విషయంలో.
గత నెల్లో మధ్యప్రదేశ్ భామిత జిల్లా ఛత్రాపూర్‌లో 17 ఏళ్ల అమ్మాయి హత్యకు గురైంది. ఆమె తల్లిదండ్రులు అనుమా నితులుగా ముగ్గురి పేర్లు చెప్పారు. వారిని అరెస్టు చేసి విచారిస్తే వారికి, ఈ కేసుకీ సంబంధం లేదని తేలి వదిలేశారు. ఆ తర్వాత మరో ఇద్ద ర్నీ ఇలానే విచారించి వదిలేశారు. పై అధికారులు, అమ్మాయి బంధువుల గోడు భరించలేకపోయాడు అనిల్ శర్మ. లాభం లేదని తనకు తెలిసిన ఒక బాబాగారి దగ్గరికి వెళ్లాడు. మంత్రాలేసి ఏమన్నా చెబుతాడేమోనని. ఆయన నాలుగు నిమ్మకాయలు తె ప్పించి విభూది విసిరి ఏదో చెబుతాడని గంపెడాశతో కొద్దిరోజులు పోలీసాయన ఆయన చుట్టూ తిరిగాడు. ఆయన ఏమి చెప్పాడో లేదో తెలీదుగాని పోలీసాయన తన పనికి సాములోరి సాయం కోరడమేమిటని తెలిసిన జనం ప్రచారం చేసి మరీ తిట్టారు.
ఒక వీడియోగ్రాఫర్ వీడియో తీసి మరీ ప్రచారం చేసి ఘనవిజయం సాధించినంత ఆనందించాడు. ఆ ఏ ఎస్ ఐని పై అధికారి నిజం గానే ఎన్ని తిట్టాలో అన్ని తిట్టి శర్మనీ, ఆయనకు సహకరించిన ఇతర పోలీసుల్ని కూడా సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వారం రోజులకు అసలు నిందితుడు దొరికాడు. అతనెవరో కాదు అమ్మాయి మేనమామ తీర్ధ అహిర్వార్. అతన్ని జైల్లో వేసి విచారిస్తు న్నారు. అయితే ఇతన్ని తామే పట్టుకున్నామని, ఎలాంటి సాములోరి సలహాలు, సూచనలు లేవని సదరు పోలీసు అధికారి ప్రకటించడం కొసమెరుపు.