వైసీపీ సిట్టింగ్ లకు స్థాన చలనం తప్పదా?.. గెలుపు గుర్రాలకే టికెట్లు అంటున్న జగన్
posted on Aug 22, 2022 @ 11:22AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రక్షాళన పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎసరు పెట్టేందుకే నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని పదే పదే చెబుతున్న జగన్ అందుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇస్తానని ఇప్పటికే కరాఖండీగా చెప్పేశారు.
విజయం సాధించే అవకాశం ఉన్న వారికే పార్టీ టికెట్ ఇస్తానని చెప్పిన ఆయన ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టేశారని అంటున్నారు. పని తీరు బాగా లేని ఎమ్మెల్యేలను అసలు పరిశీలనలోకే తీసుకునే అవకాశాలు లేవని స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. అయితే సిట్టింగ్ లు తమ పని తీరు మెరుగుపరుచుకోవడానికి ఓ ఆరు నెలలు సమయం కూడా ఇచ్చారు. అయితే ఆయన ఇప్పటికే సిట్టింగుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశారనీ, ఆరు నెలల సమయం అన్నది కేవలం ఎమ్మెల్యేలను స్వాంతన పరచడానికేననీ ఆయన తీసుకుంటున్న చర్యలు తేటతెల్లం చేస్తున్నాయి. తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయ కర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించడంతోనే జగన్ తన దృష్టిలో పనితీరు బాగా లేదనుకున్న సిట్టింగ్ లకు ప్రత్యామ్నాయాలను ఇప్పటి నుంచే అన్వేషిస్తున్న సంగతి స్పష్టమైందని పరిశీలకులు అంటున్నారు.
తాడికొండ నియోజవకర్గానికి అదనపు సమన్వయ కర్తను నియమించడం ద్వారా సిట్టింగు ఎమ్మేల్యేలందరికీ స్పష్టమైన సంకేతాన్ని జగన్ పంపారని అంటున్నారు. తాడికొండ నియోజకవర్గానికి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ను నియమించిన విధంగానే పని తీరు బాగాలేని పలు నియోజకవర్గాలకు కూడా ప్రత్యామ్నాయాలను జగన్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇటీవల వివాదాస్పద విడియో కారణంగా పార్టీ పరువును మంటగలిపిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు మరో సారి పోటీకి అవకాశం ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేరని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
ఆయన స్థానంలో ఉషశ్రీ చరణ్ ను రంగంలోనికి దింపే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కల్యాణ దుర్గం నుంచి కాంగ్రెస్ నాయకుడు రఘువీరా రెడ్డి కుమార్తెకు అవకాశం ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కూడా స్థాన చలనం తప్పదని చెబుతున్నారు. అలాగే మంత్రి అంబటి రాంబాబుకూ స్థానం మార్పు తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్యేగా పోటీచేయడానికి ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఆయన్ను వేమూరు నుంచి బరిలోకి దింపి మంత్రి మేరుగ నాగార్జునను బాపట్ల పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. అలాగే అంబటి రాంబాబును అవనిగడ్డ నుంచి రంగంలోనికి దింపాలని జగన్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మెజారిటీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను డిసెంబరుకల్లా పూర్తిచేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద సిట్టింగ్ ల స్థానాల మార్పు పార్టీలో తీవ్ర అలజడికి, అసంతృప్తికి దారి తీసే అవకాశాలున్నాయని అంటున్నారు. తాడికొండ విషయంలో ఉండవల్లి శ్రీదేవి తన అనుచరులతో పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ హోంమంత్రి సుచరిత ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని వారీ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పార్టీలో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిన అసమ్మతి జ్వాలల మాదిరిగానే.. సిట్టింగుల విషయంలో ఒక సారి జగన్ తన నిర్ణయం ప్రకటించగానే పార్టీలో అసంతృప్తి మంటలు ఎగసి పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.