తెలంగాణ పరువు తీసిన బండి సంజయ్
posted on Aug 22, 2022 @ 12:20PM
తెలంగాణ పర్యటన సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆలయం నుంచి బయటికి వచ్చినప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరుగు పరుగుల వెళ్లి మరీ అమిత్ షా చెప్పులు తెచ్చి ఆయన కాళ్ల వద్ద వేసిన వీడియో ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తెలంగాణ సమాజం బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. అమిత్ షా వెనుక ఉన్న సంజయ్ హడావుడిగా ముందుకు వెళ్లి మరీ షా పాదరక్షలు తెచ్చి ఆయన కాళ్ల వద్ద ఉంచడంతో తెలంగాణ సమాజం విస్తుపోతోంది.
ఇక ఏ చిన్న ఛాన్స్ దొరికినా కేంద్ర స్థాయిలో విరుచుకుపడే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఈ అంశంపై తీవ్రంగా ప్రతిస్పందించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పులు మోసి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు బానిసత్వాన్ని పరిచయం చేస్తున్నారంటూ తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ నిప్పులు చెరిగారు. బండి సంజయ్ తో చెప్పులు మోయించడం ద్వారా తెలంగాణ సమాజాన్ని అమిత్ షా కించపరిచారని విరుచుకుపడ్డారు. మునుగోడు ఆత్మగౌరవంగా చెబుతున్న బీజేపీ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని , అమిత్ షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టిందని దుమ్మెత్తిపోశారు.
బండి సంజయ్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలుగువారి ఆత్మగౌరవాన్ని అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టారని, బీజేపీలో బీసీ నేత స్థానం ఏంటో చూడండి.. తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా?.. అమిత్ షా చెప్పులు మోయడమేంటి?’ అంటూ ట్వీట్ చేశారు.
ఇక ఇప్పటికే కేంద్రంపైన, మోడీ, షా ద్వయం పైనా ఒంటికాలిపై లేస్తున్న టీఆర్ఎస్ నేతలు మాత్రం షా చెప్పులు మోసిన బండి సంజయ్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడ్ని- తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పికొట్టి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్గాలూ సిద్ధంగా ఉన్నాయి’ అంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తన ట్వీట్ తో పాటు షా చెప్పులు మోసిన బండి సంజయ్ వీడియోను కూడా కేటీఆర్ షేర్ చేశారు. గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా? అంటూ కొందరు నెటిజన్లు బండి సంజయ్ వ్యవహార సరళిని తప్పుపడుతున్నారు.
ఇలా ఉండగా.. అమిత్ షా చెప్పులు బండి సంజయ్ మోసిన పరిణామం వెనుక ఓ మర్మం దిగి ఉందని మరి మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో అధికారానికి, పెత్తనానికి సంబంధించి బండి సంజయ్- ఈటల రాజేందర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందని అంటున్నారు. ముందు నుంచీ బీజేపీలో ఉన్న తన కంటే ఇటీవలే పార్టీలో చేరిన ఈటల రాజేందర్ కు ప్రాధాన్యత వస్తోందని బండి సంజయ్ కు మింగుడు పడడం లేదంటున్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఉద్యమ నేపథ్యంతో పాటు ప్రజాభిమానం కూడా ఉన్న ఈటలను ఎదుర్కోవడం సంజయ్ కి తెలియకపోలేదంటున్నారు. అందుకే బీజేపీకి నరనారాయణులుగా ప్రసిద్ధి చెందిన అమిత్ షా-నరేంద్ర మోడీ ద్వయాన్ని ప్రసన్నం చేసుకునేందుకే బండి సంజయ్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బండి సంజయ్ లో ఆ క్రమంలోనే కాస్త పరిధులు దాటి మరీ అమిత్ షా చెప్పులు మోసే స్థాయికి దిగజారారంటున్నారు.