గెలుపే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు.. జగన్ కు కౌంట్ డౌన్ స్టార్టేనా?
posted on Sep 10, 2022 @ 10:09AM
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఇరవై నెలల సమయం ఉంది. అయినప్పటికీ సీఎం జగన్ ను, వైసీపీని ఓడించేందుకు టీడీపీ అధినేత కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభించారు. వైసీపీ సర్కార్ ఏర్పాటైన తొలి నాళ్లలో ఫీల్ గుడ్ అని భావించిన జనాల్లో ఇప్పుడు ఫీల్ బ్యాడ్ ఒపీనియన్ బాగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని పలు సర్వేల్లో వెల్లడవుతోంది. వైసీపీ సర్కార్ పని తీరు పైనా, జగన్ పైనా జనం పూర్తి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్లు పలు సర్వేల్లో వస్తోంది. దానికి తోడు వైసీపీ సర్కార్ గ్రాఫ్ గత ఆరు నెలల్లో బాగా పడిపోయిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు సరికొత్త ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు. ‘పార్టీ కోసం త్యాగాలు చేయాలి.. మీ కోసం పార్టీ త్యాగం చేయదు’ అని పార్టీ నేతలకు ఆయన కచ్చితంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే దిశగా కృషిచేయాలని, అందు కోసం త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఓడిపోతారని సర్వేల్లో తేలితే సీనియర్లు అయినా పక్కన పెట్టేయడానికి సిద్ధమనే సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నారు. పనితీరు సరిగా లేకపోతే గతంలో మంత్రులుగా పనిచేసిన వారికి కూడా టికెట్లు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చారంటున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు రకరకాల కార్యక్రమాలతో తాను ప్రజల మధ్యే ఉండటం కాకుండా తెలుగుదేశం పార్టీ నేతలు నిత్యం రాష్ట్ర ప్రజల మధ్యనే ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అది ‘బాదుడే బాదుడు’ కావచ్చు.. లేదా తాను స్వయంగా చేస్తున్న జిల్లాల పర్యటనలు కావచ్చు.. ఏపీలో నెలకొన్న వివిధ సమస్యలపై టీడీపీ నేతల్ని వారి వారి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించేలా పురమాయించడం కావచ్చు.. ఏదైతేనేం వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ.. చంద్రబాబు అండ్ కో జనం మనసులో మరింత దృఢమైన స్థానం సంపాదించుకునే యత్నం చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనుభవానికి ప్రజలు పట్టం కట్టారు. ఆ క్రమంలోనే ఒక పక్కన ఆంధ్రుల ప్రజా రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించారాయన. మరో చేత్తో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా నడిపించారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించారు. అయితే.. ఒక్క ఛాన్స్ అంటూ ప్రభుత్వ పగ్గాలు అందుకున్న జగన్ ఈ మూడున్నరేళ్లలో చేసిందేమీ లేదని, పైగా రాష్ట్రాన్ని అన్నింట్లోనూ అధోగతిపాలు చేశారనే ఆగ్రహం ప్రజల్లో బాగా వచ్చేసింది. ఇద్దరి పరిపాలనా విధానాలను, వారి అనుభవాలను, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ఎవరు పరుగులు పెట్టించగలరనే అంశాలపై జనం బేరీజు వేసుకుంటున్నారంటున్నారు.
ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే వినాయక చవితి తర్వాత జగన్ సర్కార్ ఉండదని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో వ్యక్తిగత నైతిక విలువలను జగన్ పాతిపెట్టేశారనేది విష్ణుకుమార్ రాజు ఆరోపణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఏపీలో సంచలన పరిణామాలు చూస్తారని కామెంట్ చేయడం గమనార్హం.
కరోనా కాలం రెండేళ్లలో ఏపీ అన్ని విధాలా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. ఈ దశలో ఏపీలో ఏమి అభివృద్ధి జరుగుతోందనే ప్రశ్న జనం మదిలోకి వచ్చింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, రోడ్ల దుస్థితి, ఆ రోడ్లపై నిత్యం ప్రత్యక్ష నరకం చవిచూస్తుండడం, విద్యుత్, బస్సు చార్జీల పెంపు తమ జీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తుండడంతో జగన్ సర్కార్ పై జనంలో పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనితో పాటు అధికారపక్షం వాయిస్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. విపక్షాల వాయిస్ జనంలోకి పూర్తిగొ చొచ్చుకుపోతోంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా చంద్రబాబు స్వయంగా రంగంలో దిగారు. టీడీపీ కొంచెం వీక్ గా ఉందనిపించిన నియోజకవర్గాలపై ఆయనే దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి వాటిలో కృష్ణా జిల్లాలోని గుడివాడపై చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెంచారంటున్నారు. వైసీపీని మరోసారి అధికారంలోకి రాకుండా చేయడం.. మరో పక్కన టీడీపీపైన, తన కుటుంబంపైన వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ నేతలను మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకుండా చేయాలని ఆయన కంకణం కట్టుకుని వ్యూహాలు రచిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్న మాట.