తెలుగు రాష్ట్రాల్లో చట్టసభలు .. ఛీ ..ఛీ!
posted on Sep 11, 2022 8:58AM
రాష్ట్ర విభజన వలన తెలుగు ప్రజలకు ఏమి మేలు జరిగిందో, ఏమో కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ, ప్రజాస్వామ్య వ్యవస్థలు మాత్రం అధ:పాతాళానికి దిగజారి తెలుగు ప్రజల గౌరవాన్ని జాతీయ స్థాయిలో దిగజార్చివేస్తున్నాయి. ఇక చట్ట సభల తీరు అయితే చెప్పనే అక్కరలేదు. అసలు చట్ట సభలు ఎందుకు దండగ, అనే అభిప్రాయానికి ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలూ వచ్చాయా? అనే విధంగా చట్టసభల తీరు తెన్నులు రోజురోజుకు, నానాటికీ తీసికట్టు నాగం బొట్లు అన్నట్లు జారుడు బండపై దిగజారి పోతున్నాయి. ఇది ఎవరో ఒకరిద్దరు ప్రముఖుల అభిప్రాయం మాత్రమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏ ఒకరిని కదిల్చినా, అందరి అభిప్రాయమూ అదేగా వుంది.
రాజకీయ సంస్కారం అనేది. కాగడాలు కాదు, ఫ్లడ్ లైట్స్ పెట్టి వెతికినా ఉభయ తెలుగు రాష్ట్రలలో ఎక్కడా కనిపించదు. ముఖ్యంగా చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి సహా మంత్రులు అధికార పార్టీ సభ్యుల ప్రవర్తన ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఉందని వేరే చెప్ప నక్కర్లేదు. చట్టసభల ప్రత్యక్ష ప్రసారాలు పిల్లలు చూడకూడదనీ, చూస్తే ఆ భాష విని పిల్లు చెడి పోతారని తల్లి తండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. ఏపీ అసెంబ్లీ విషయాన్నే తీసుకుంటే, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, అధికార పార్టీ సభ్యుల దుష్ప్రవర్తన భరించలేక, ఆవేదనతో సభను బహిష్కరించారు.
ఎంతో అనుభవం, అంతకు మించిన ఓర్పు ఉన్న చంద్రబాబు నాయుడే, కలత చెంది నిండు సభలో కన్నీరు పెట్టుకోవలసి వచ్చిందంటే, అధికార వైసీపీ సభ్యుల ప్రవర్తన ఎంత దుర్మార్గంగా వుందో వేరే చెప్పనక్కర్లేదు. అయితే, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అందుకే, సభలో ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యులను దూషించి ఆనందం పొందిన ముఖ్యమంత్రి, అధికార వైసేపీ సభ్యులు అవే అవమానాలను అనుభవిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి భారతి పై ఆరోపణలు రావడంతో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విలవిలలాడి పోతున్నారు.
నిజానికి, ఆ కేసులలో భారతి ప్రమేయం ఉందా లేదా అనేది ఇప్పడు అప్రస్తుతం. కానీ, రాజకీయ విమర్శలు నిందలు గీత దాటి కుటుంబ సభ్యులు,ముఖ్యంగా ప్రత్యర్ధుల కుటుంబ సభ్యులను మరీ ముఖ్యంగా మహిళలను అసభ్యంగా దూషించడం తేలికే కానీ, సీన్ రివర్స్ అయితే భరించడం కష్టం. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అది అర్థమైందో లేదో కానీ, భారతి పై వస్తున్న ఆరోపణలను ఖండించడం లేదని, అయన మంత్ర్రుల పై మండిపడడం చూస్తుంటే ముల్లు గట్టిగానే గుచ్చుకున్నట్లుందని అంటున్నారు.
ఇక తెలంగాణ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల వరకు ప్రతి ఒక్కరూ భాష విషంలో గీత దాటడమే కాదు. ప్రజాస్వామ్య విలువలు పాటించడం వరకు ఏ ఒక్క విషయంలోనూ రాజకీయ మర్యాదలనే కాదు, రాజ్యాంగ మర్యాదలనూ పాటించడం లేదు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయాన్నే తీసుకుంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పనక్కర లేదు.
ఈ అన్నిటినీ మించి, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నీళ్లు వదిలేశాయని, రాజకీయ విశ్లేషకులు, రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు. నిజానికి చట్ట సభల అవసరమే లేదన్న తీరున సభా సంప్రదాయాలనే కాదు, రాజ్యాంగ విధులకు, విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత లేదన్నా సంవత్సరంలో కనీసం 60 రోజులు ఉభయ సభలు సమావేశమయ్యేవి. ఇంతో కొంత మేరకు ప్రజాసమస్యలు చర్చకు వచ్చేవి. ముఖ్యంగా పెద్దల సభలో అర్ధవంతమైన చర్చలు జరిగేవి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు తమ సమస్యలను ఆందోళనల రూపంలోనో, అభ్యర్ధనల రూపంలో ప్రభుత్వ దృష్టికి తెచ్చే అవకాశం ఉండేది. ఇప్పడు, సభా దినాలు కుదించుకు పోయాయి. తెలంగాణ వర్షాకాల సమావేశాలు మూడాంటే మూడే రోజులు జరుగు తున్నాయి. ఏపీలో,గత బడ్జెట్ సమావేశాలు కొవిడ్ సాకుగా చూపి ఒకే ఒక్క రోజు నిర్వహించారు. రూ. 2.56లక్షల కోట్ల ప్రజాధనానికి సంబదించిన బడ్జెట్ ను, ఆర్థిక మంత్రి బుగ్గన తూతూ మంత్రంగా సగం చదివి, సగం చదవకుండానే సభ ఆమోదం కోరారు.
అసెంబ్లీలో చర్చలు జరిగితేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ప్రభుత్వాలు అసెంబ్లీ పని దినాలను నరుక్కుంటూ పోతున్నాయి. చర్చలు జరపడానికి ఆసక్తి చూపించడం లేదు. కేవలం రాజ్యాంగ నిబంధనలను పాటిస్తున్నామని చెప్పుకునేందుకు మాత్రమే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో శాసన సభ సమావేశాలు, ఒక మొక్కుబడి తంతుగా నిర్వహిస్తున్నారు.నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు తిరిగులేనంత మెజార్టీ ఉంది. తమ వాదన బలంగా వినిపించుకునే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేల వాదన ఏ కొంచెం వినలేని అసహనాన్ని ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్నాయి. ఇది శోచనీయం. అందుకే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి పెద్దలు చట్టసభల తీరు పట్ల అసంతృప్తి, ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.