రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాటకు ఇదా వేదిక.. అసోం సీఎం తీరును తప్పుపడుతున్న జనం
posted on Sep 10, 2022 @ 3:29PM
తెలంగాణలో సందర్బం ఉన్నా లేకున్నా వివాదం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశం వినా బీజేపీకి మరో లక్ష్యం, ధ్యేయం లేదన్నట్లుగా ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఉన్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. మత సామరస్యానికీ, సామాజిక సామూహికత్వానికి ప్రతీకగా జరిగే ఈ కార్యక్రమంలో అన్నివర్గాల ప్రజలూ మమేకమై రాజకీయాలకు అతీతంగా ప్రజలే స్వచ్ఛందంగా జరుపుకునే ఒక పండుగ. అటువంటి కార్యక్రమంలో కూడా రాజకీయ లబ్ధిని వెతుక్కునే కార్యక్రమానికి పార్టీలు ఉపక్రమించడం పట్ల సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది.
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా సందడి కోల్పోయిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఈ ఏడాది కన్నుల పండువగా సాగింది. భక్త జనం తండోపతండాలుగా ఈ వేడుకను తిలకించేందుకు కదలి వచ్చారు. అత్యంత శోభాయమానంగా జరిగిన ఈ వేడుకలో పాలకుండలో ఉప్పుకణిక పడిన చందంగా మొజాంజాహీ మార్కెట్ వద్ద జరిగిన సంఘటన శోభాయాత్రకు ఓ మచ్చలా పరిణమించింది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందకు వచ్చిన అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ, ఆ పనిని పక్కన పెట్టి రాజకీయ ప్రసంగం చేయడం పట్ల సర్వత్రా నిరసన, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అసోం నుంచి వచ్చిన ఆయన ఇక్కడ రాజకీయ రచ్చకు కారణం అవ్వడాన్ని అంతా ఎత్తి చూపుతున్నారు. గతంలో ఎన్నడూ శోభాయాత్ర సందర్భంగా ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని గుర్తు చేసుకుంటున్నారు.
బీజేపీ కారణంగానే రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన శోభాయాత్రలో అనవసర వివాదం తలెత్తిందని విమర్శిస్తున్నారు. మొజాంజాహీ మార్కెట్ వద్ద గణనాథులను ఆహ్వానించేందుకు ఏర్పాటు చేసిన వేదిక పై ప్రసంగించిన అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ రాజకీయాలు మాట్లాడడమే వివాదానికి కారణమైంది. తెరాస నేత నందూలాల్ అసోంసీఎం ప్రసంగాన్ని అడ్డుకుని ఆయన చేతిలో మైకు లాక్కోవడానికి ప్రయత్నించారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమంలో హేమంత్ బిశ్వశర్మ రాజకీయ ప్రస్తావన తీసుకురావడం ఉద్రిక్తతకు కారణమైంది. ఇదే కాకుండా అంతకు ముందు కూడా ఇదే ఎంజీఎం మార్కెట్ దగ్గర ఫ్లెక్సీల విషయంలో కూడా వివాదం నెలకొంది. అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ ఫ్లెక్సీకి పోటీగా మంత్రి తలసాని ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు వచ్చిన తెరాస కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు, గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ తరువాత హేమంత్ బిశ్వశర్మ రాజకీయ ప్రసంగం ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడేందుకు కారణమైంది. కాగా గణేష్ నిమజ్జన శోభాయాత్రలో రాజకీయ ప్రసంగాలేమిటని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ప్రతీ రోజు రాజకీయ విమర్శలతో ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకునే తెరాస, బీజేపీలు ఒక్క రోజు తమ రాజకీయ విమర్శలకు, ప్రసంగాలకూ విరామం ప్రకటించేపాటి నియంత్రణను కూడా కోల్పోయాయా? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ గణేష్ శోభాయాత్రను కూడా రాజకీయ వేదికను చేయడానికి ప్రయత్నించడం పట్ల రాజకీయ వర్గాలలో సైతం విమర్శలు వ్యక్తమౌతున్నాయి. హైదరాబాద్ లో వినాయక శోభయాత్రను చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానన్న అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ అక్కడితో ఆగకుండా.. తెలంగాణ లో కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలి కానీ.. కుటుంబ పక్షాన ఉండకూడదన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలు కేవలం ఒక్క ఫ్యామిలీ మాత్రమే అనుభవిస్తోందని , అలా కాకుండా మిగిలిన అన్ని కుటుంబాలకు మంచి జరిగేలా చూడాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నాననీ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా తెలంగాణలో టీఆర్ఎస్ పాలన రజాకార్ల పాలనను తలపిస్తోందని, కేసీఆర్ పాలన నుండి తెలంగాణకు విముక్తి కల్పించాలని పిలుపు నిచ్చారు.
దీంతో ఈ వేదికపై రాజకీయ విమర్శలేమిటని పేర్కొంటూ టీఆర్ఎస్ నేత నందూ బిలాల్ మైకు లాక్కునేందుకు ప్రయత్నించగా ఆయనను గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు వేదికపై నుంచి లాగేశారు. ఏది ఏమైనా తెరాస కూడా ఒకింత నియంత్రణ పాటించి ఉంటే శోభాయాత్రకు రాజకీయ మరక అంటి ఉండేది కాదని సామాన్యులు సైతం అంటున్నారు. అదే సమయంలో అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ తీరును తప్పుపడుతున్నారు.