అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రసంగం దేనికి దర్పణం?
posted on Sep 13, 2022 @ 10:45AM
కేసీఆర్ సమయం, సందర్భం పట్టించుకోకుండా ఇటీవల మోడీ వ్యతిరేకత ఒక్కటే దేశంలో ప్రధాన అంశంగా ప్రసంగాలు చేస్తున్నారు. అది రైతులతో సమావేశమైనా, మునుగోడు ఉప ఎన్నిక సన్నాహక సభ అయినా, రైతులతో సమావేశమైనా, ఆఖరికి అసెంబ్లీ అయినా ఆయన ప్రసంగాలు మోడీ వల్ల దేశానికి, తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతోందని చెప్పడానికే పరిమితమౌతున్నాయి. ఆయన నోటి నుంచి మోడీ సర్కార్ పై విమర్శలు వినా.. రాష్ట్రంలో పరిస్థితుల గురించి.. నెలకొన్న సమస్యల గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా రావడం లేదు.
మోడీ, కేంద్రం తెలంగాణకు.. దేశానికి తీవ్ర అన్యాయం చేశారని, అలాగే మోడీ పాలనలో దేశం అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని చెప్పడానికే పరిమితమౌతున్నారు. ఆఖరికి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన బాణి, వాణి ఇదే అయిపోయింది. .రెండురోజుల పాటు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో .. కేసీఆర్ తొలి రోజు దాదాపు రెండు గంటల పాటు చేసిన ప్రసంగం మొత్తం మోడీని విమర్శించడానికి.. ఆయన పాలనలో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేసింది చెప్పడం ఊరుకోకుండా దేశానికి మోడీ వల్ల జరిగిన నష్టం.. తనతో సఖ్యతగా ఉన్న సీఎంలు ఉన్న రాష్ట్రాలకూ మోడీ నేతృత్వంలోని కేంద్రం చేసిన అన్యాయం తదితర అంశాలను ఏకరవు పెట్టడానికే కేటాయించారు.
తెలంగాణకు మోదీ అన్యాయం చేశారని చెప్పడానికి ఏడుమండలాల దగ్గర్నుంచి ప్రారంభించారు. చంద్రబాబు చేతిలో కీలబొమ్మగా మారి ఏడు మండలాల విలీనం నుంచి ఇప్పుడు కరెంట్ బకాయిల పేరుతో ప్రపంచంలో ఎక్కడా లేనంత వడ్డీ వేసి కట్టమని ఆదేశించడం వరకూ దేనినీ వదల లేదు. అదే సమయంలో తెలంగామకు రావాల్సిన వాటి గురించి మాత్రం మోడీ ఎందుకు నోరు విప్పరని నిలదీశారు. తెలంగాణ విషయంలో మోడీ సర్కార్ చేసిన, చేస్తున్న అన్యాయాల గురించి గతంలో పలుమార్లు చెప్పిన విషయాలనే మరో సారి అసెంబ్లీ వేదికగా కేసీఆర్ వల్లె వేశారు.
వ్యవసాయానికి రైతులను దూరం చేసే కుట్ర మోడీ సర్కార్ చేస్తోందన్నారు. రాష్ట్రంలో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టేస్తామంటూ కేంద్ర హోంమంత్రే చెప్పడం సిగ్గు చేటన్నారు. తెలంగాణను ఎంత మంది షిండేలు, బొండేలు వచ్చినా ఇక్కడ ఏమీ చేయలేరని హెచ్చరించారు. హిట్లర్ లాంటి వాడే కాలగర్భంలో కలిసిపోయాడని మోడీ ఎంత అని కేసీఆర్ అన్నారు.
అధికారం, అహంకారం తలకెక్కిన మోడీకి గుణపాఠం చెబుతామన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం మొత్తం ఆయన జాతీయ రాజకీయ అజెండాకు నకలుగా ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఆరు నెలల్లోపు సభ నర్వహించాల్సి ఉండటంతో అనివార్యంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారే కానీ ఆయన దృష్టి మొత్తం జాతీయ రాజకీయాల మీదే ఉంది. అందుకే అసెంబ్లీని కూడా ఆయన దానికే వేదికగా మార్చుకున్నారు.