అసెంబ్లీ సమావేశాలు ఎందుకోసం?ఎవరి కోసం ?
posted on Sep 13, 2022 @ 11:05AM
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఏమి కోరుకుంటున్నారు? ఏమి ఆశిస్తున్నారు? రాష్ట్ర శాసన సభ వేదికగా ముఖ్యమంత్రి చేసిన సుదీర్ఘ ప్రసంగం విన్న ఎవరికైనా, ఇదే అనుమానం వస్తుంది. సోమవారం (సెప్టెంబర్ 12) కేవలం మూడు గంటల పాటు జరిగన సభలో సుమారు రెండు గంటలు సాగిన ముఖ్యమంత్రి ప్రసంగంలో, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న ఏ ఒక్క సమస్యనూ ప్రస్తావించలేదు.కేంద్ర ప్రభుతాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని విమర్శించడం కోసమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా, అనే అనుమానం వచ్చే విధంగా ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది.
పోనీ, అందులో అయినా ఏదైనా కొత్త విషయం వుందా? అంటే, అదీ లేదు. ఇప్పటికే, పార్టీ వేదికలు,బహిరంగ సభలు, విలేకరుల సమావేశాలలో ఒకటికి పదిసార్లు ఏకరవు పెట్టిన విషయాలనే, అసెంబ్లీ వేదికగా మరో సారి ఏకరవు పెట్టారు. నిజమే కావచ్చును,కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి, దేశానికి ప్రమాదకరంగా పరిణమించిందని, ముఖ్యమంత్రి భావిస్తే భావించవచ్చును. ఆయన జాతీయ పార్టీ పెట్టి దేశాన్నిప్రగతి పథంలో ముందుకు తీసుకుపోదామనుకుంటే, అందుకు కూడా ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఆయన ప్రధాన మంత్రి కావాలనుకుంటే కాదనే వారుండరు. గుజరాత్ ముఖ్యంత్రిగా మోడీ ఎలాంటి పాలన అందించారో ఏమో కానీ, దేశ ప్రజలు ఆమోదిస్తేనే ఆయన ప్రధాని అయ్యారు. అలాగే రేపు దేశ ప్రజలు ఆమోదిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాని కావచ్చును. అందుకు ఎవరూ అభ్యతరం చెప్పరు.
కానీ, అందుకోసం తెలంగాణ శాసన సభను ప్రచార వేదిక చేసుకోవడం, ఏమిటనేదే సామాన్య ప్రజలు అడుగుతున్నప్రశ్న. ఆరు నెలల తర్వాత, అది కూడా కేవలం రెండే రెండు రోజులు (మొదటి రోజు సంతాప తీర్మానాలతో సభ వాయిదా పడింది) శాసన సభ జరుగతున్న వేళ రాష్ట్రంలో సమస్యలే లేవన్నట్లు, ముఖ్యంత్రి రాజేకీయ ప్రసంగం చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు కొదవ లేదు? ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ‘జాతి’ ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం (కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం) విఫలమైందని ఆరోపిస్తూ,ఇంచు మించుగా రెండు నెలలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏలు, బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాల ముట్టడికి ప్రయత్నించారు. రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
బంజారాహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అలాగే జిల్లా నుంచి హైదరాబాద్ వస్తున్న వీఆర్ఏలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినట్లు వీఆర్ఎ జేఏసీ ఆరోపిస్తోంది. నిజానికి వీఆర్‌ఏల జేఏసీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే కోరుతున్నామని జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదెమియా తెలిపారు. అంతేకాదు ప్రభుత్వం తమను చర్చలకు పిలిచి, సమస్యలు పరిష్కరించి, సమ్మె విరమింప చేసేందుకు చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరుతున్నామన్నారు.
రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులను చర్చలకు పిలకుండా, అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో ఆందోళనను అంచి వేయాలనుకోవడం, ఎంత వరకు సమంజసం? అది ఎలాంటి ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది? ఇది ఏ మోడల్ పాలనకు సంకేతం అవుతుందని వీఆర్ఏలే కాదు సామాన్యులు కూడా అడుగుతున్న ప్రశ్న. గతంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే అణచివేత విధానాలను అవలంబించిన నేపధ్యాన్ని జేఏసీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు, ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నదని వీఆర్ఏలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి, ప్రభుత్వ వైఖరికి విసిగిపోయిన వీఆర్ఏలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా సర్కార్ లో చంలనం లేక పోగా, స్వయంగా ముఖ్యమంత్రి వీఆర్‌ఏల ఆందోళన అర్థంలేని ఆందోళన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావచ్చు, వారిది అర్థం లేని ఆందోళన అయినా కావచ్చును, కానీ, ప్రజస్వామ్య పద్దతిలో వారిని చర్చలకు పిలిచి సమస్యను చర్చించడంలో తప్పేముందని, తెరాస ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తున్నారు.
నిజానికి, ఒక్క వీఆర్ఏ సమస్యనే కాదు, ధరణి సమస్యకు బడుగు రైతులు బలవుతున్నారు. అన్నిటినీ మించి, సంక్షేమ హాస్టళ్ల విద్యార్ధులు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పినట్లుగా ‘సిల్లీ’ సమస్యలతో చచ్చిపోతున్నారు. వర్ధన్న పేట గురుకుల హాస్టల్ లో కలుషిత ఆహరం తిని 60 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. అందులో పది మంది విద్యార్ధులు ఇప్పటికీ ఇంకా కోలుకో లేదు. చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యనే కామరెడ్డి జిల్లాలోని ఓ బీసీ హాస్టల్ లో ఓ చిన్నారి పాము కరిచి కన్నుమూసింది. ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు, ఎదుర్కుంటున్న సిల్లీ సమస్యల గురించి అయితే చెప్పనే అక్కరలేదు. కలుషిత ఆహారం కారణంగా ఒక విద్యార్థి చనిపోయారు. వందల మంది పిల్లలు తీవ్ర అస్వత్తకు గురయ్యారు. అసఫాబాద్ లో ఒక డిగ్రీ విద్యార్ధిని చని పోయారు. మరో నలుగురు చిన్నారులు చనిపోయారు.
పరిగిలో వందమందికి పైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి ఇంట అద్వాన్నంగా ఉంటే, అసెంబ్లీలో చర్చ ఉండదు. కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించినా ముఖ్యమంత్రి పట్టించుకోరు. సభా ముఖంగా ఒక హామీ ఇవ్వరు.. ఇదేమి తీరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇవి మాత్రమే కాదు, చెప్పుకుంటూ పోతే .. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల చిట్టా ఇంకా వుంది.. కానీ, ముఖ్యమంత్రి ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి ..