ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి
posted on Sep 13, 2022 7:16AM
హైదరాబాద్ లో సోమవారం రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాంలో ఏడుగురు మరణించారు. మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంద. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ కు సమీపంలోని రూబీ హోటల్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ హోటల్ కింద ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో తొలుత మంటలు వ్యాపించాయి. దాంతో షో రూంలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒకదాని తరువాత ఒకటిగా వరుసగా పేలిపోయాయి. దీంతో మంటలు పై అంతస్థులో ఉన్న హోటల్ కు వ్యాపించాయి. దట్టమైన పొగతో హోటల్ లో ఉన్న వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఏం జరుగుతోందో తెలిసేలోగా కొందరు సజీవదహనమయ్యారు. మరి కొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఇంకొందరు ప్రాణభయంతో పై నుంచి దూకేసీ గాయపడ్డారు.
ఈ అగ్నిప్రమాద ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డులో.. రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూం ఉంది. సెల్లార్‌లో ఆ షోరూం వాహనాల గోడౌన్ లో రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఈ-స్కూటర్ పేలిపోయింది. ఆ వెంటనే మంటలు ఇతర వాహనాలకు వ్యాపిం చి, ఒకదాని తరువాత ఒకటిగా పలు వాహనాలు భారీ శబ్దంతో పేలిపోయాయి.
సంఘటన జరిగిన సమయంలో గోడౌన్ లో ఎవరూ లేరు. కానీ మంటలు పైన ఉన్న రూబీ హోటల్‌కు వ్యాపించాయి. ఆ సమయంలో హోటల్‌లో పాతిక మంది బసచేసినట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.