టాలీవుడ్‌పై ఆర్జీవీ విసుర్లు
posted on Sep 13, 2022 5:52AM
టాలీవుడ్ ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి టాలీవుడ్‌కు తీరని లోటని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఇప్పటికే విచారం వ్యక్తం చేశారు. అయితే కృష్ణంరాజు మృతి చెందితే టాలీవుడ్‌లో సినిమా షూటింగులు నిలిపివేయకపోవడంపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు... సిగ్గు! సిగ్గు! అంటూ రామ్‌గోపాల్‌వర్మ తనదైన శైలిలో స్పందించారు.
అలాగే కృష్ణగారికి,మురళీమోహన్‌గారికి, చిరంజీవిగారికి , మోహనబాబుగారికి, బాలయ్యకి, ప్రభాస్‌కి, మహేశ్ బాబుకి, పవన్‌కల్యాణ్‌కి.. నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిదని రామ్‌గోపాల్‌వర్మ అభిప్రాయపడ్డారు.
మనస్సు మనకు లేకపోయినా ఒకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దామన్నారు ఆర్జీవీ. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదామని.. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోందంటూ నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనదని ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ గుర్తు చేశారు. మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువనిద్దామని.... కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదామంటూ ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ పరిశ్రమను కోరారు.
ప్రముఖ నటుడు కృష్ణంరాజు సెప్టెంబర్ 11వ తేదీ తెల్లవారుజామున 3.25 గంటలకు మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనార్యోగంతో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోమవారం హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ సమీపంలో కొండమామిడిలోని కృష్ణంరాజు ఫాం హౌస్‌లో పూర్తి అధికార లాంచనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. కృష్ణంరాజు అంత్యక్రియలకు వివిధ రంగాల ప్రముఖలే కాదు.. ఆయన అభిమానులు సైతం భారీగా తరలి వచ్చారు.