ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ స్పీడ్ కు మునుగోడు బ్రేక్
posted on Sep 12, 2022 @ 6:19PM
అధికారం చేతిలో ఉంటే రాజకీయ లబ్ధి కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు ఉపయోగించుకోవచ్చు. అలాగే తమ రాజకీయ లబ్ధికి ఇబ్బంది అవుతుందని భావిస్తే వాటి స్పీడుకు బ్రేకులూ వేయవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అదే చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీలకు చెందిన వారి ప్రమేయం ఉందంటూ వచ్చిన వార్తలు, ఆ తరువాత హైదరాబాద్ లో ఈడీ జరిపిన సోదాలలో వెలుగులోనికి వచ్చిన అంశాలతో త్వరలో నోటీసులు అరెస్టులు అనివార్యం అంటూ మీడియాలో కుప్ప తెప్పలుగా కథనాలు వచ్చాయి. ఈ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వెల్లువెత్తాయి. తనపై ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించిన ఆమె చివరికి తనపై ఆరోపణలు చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అలాగే ఇదే కుంభ కోణంలో ఏకంగా ఏపీ సీఎం జగన్ సతీమణి భారతిపై కూడా ఆరోపణలు వచ్చాయి. అలాగే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి పైనా ఆరోపనలు వెల్లువెత్తాయి. బీజేపీ ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ రాజకీయ నాయకులపై ఆరోపణలు గుప్పించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఆరోపణల పర్వానికి తెర తీశారు. అన్ని ఆధారాలూ ఉన్నాయనీ, త్వరలోనే కుంభకోణంలో ప్రమేయం ఉన్నవారి గుట్టు బయటపడుతుందనీ ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. అదలా ఉండగా సీబీఐ, ఈడీలు ఢిల్లీ లిక్కర్ స్కాంలో దూకుడు మీద దర్యాప్తు చేపట్టాయి. ఈడీ అయితే హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఎకకాలంలో తనిఖీలు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
ఈడీ దూకుడు గమనించిన పరిశీలకులు సైతం ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి నోటీసులు, అరెస్టుల పర్వం అనివార్యం అని భావించారు. అయితే అంతలోనే ఈడీ స్పీడ్ మందగించింది. లిక్కర్ స్కాం కు సంబంధించిన విచారణ పురోగతికి సంబంధించి ఎటువంటి సమాచారమూ బయటకు పొక్కడంలేదు. ఈడీ స్పీడ్ కు బ్రేక్ పడిందని అంటున్నారు. అయితే ఈడీ స్పీడ్ కు మునుగోడు ఉప ఎన్నిక వల్ల బ్రేక్ పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సహా ఎవరికి నోటీసులు జారీ చేసినా, ఎవరిపైనైననా చర్యలు తీసుకున్నా అది మునుగోడు ఉప ఎన్నికలో తెరాస పార్టీకి ప్రయోజనం కూర్చుతుందని బీజేపీ భావిస్తోంది.
అందుకే మునుగోడు ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ ఈడీ ఈ స్కాం దర్యాప్తులో స్పీడ్ తగ్గితే మేలని బీజేపీ పెద్దలు భావించడం వల్లనే ఈడీ స్పీడ్ కు బ్రేకులు వేసిందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక పూర్తి అయిన తరువాత మళ్లీ ఈడీ స్పీడ్ పెరుగుతుందనీ, అంత వరకూ ఈ కేసుకు సంబంధించి పెద్దగా పురోగతి ఉండే అవకాశాలు దాదాపు మృగ్యమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఈ స్కాం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సన్నిహితులు ఆరుగురిని ఈడీ విచారించడం రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ వ్యవహారంలో ఏకంగా తెలంగాణ సీఎస్ ప్రమేయంపై ఈడీ విచారణ ప్రారంభించడంతో తెలంగాణా సర్కార్ ఉక్కిరిబిక్కిరిఅవుతున్న మాట వాస్తవమే అయినా, అదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక ముంగిట సంభవించిన ఈ పరిణామాల కారణంగా తెరాసకు ఉప ఎన్నికలో ప్రయేజనం చేకూరు అవకాశాలున్నాయని బీజేపీ గ్రహించింది.
ఇప్పటికే ప్రత్యర్థులపైకి కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపి వారిని ఇక్కట్లకు గురి చేస్తున్నదన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న కేంద్రం మునుగోడు ఉప ఎన్నిక ముంగిట ఆ ఆరోపణలకుబలం చేకూర్చే అవకాశం ఇవ్వరాదన్న ఉద్దేశంతోనే ఈడీ స్పీడుకు బ్రేకులు వేసిందని అంటున్నారు.