అధ్యక్ష రేసు నుంచి గెహ్లాట్ ఔట్.. రాహుల్ వైపే అందరి చూపు!
posted on Sep 28, 2022 1:18AM
కాంగ్రెస్ పార్టీ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం బయటి వ్యక్తులకు అప్పగిస్తే ఏం జరుగుతుందన్నదానికి గెహ్లాట్ ఎపిసోడ్ ఒక ట్రయిలర్ మాత్రమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. గెహ్లాట్ ఉదంతంతోనైనా రాహుల్ గాంధీ అధ్యక్ష పగ్గాలు అందుకోవాలని ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి.
పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఆరంభమై నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతున్న పార్టీకి వీరవిధేయుడిగా ఇంత కాలం భావించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తిరుగుబావుటా ఎగురవేశారు. రాజస్ధాన్ సీఎంగా తన విధేయుడిని నియమించి తీరాల్సిందేనని భీష్మించారు. తన వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటూ బెదరించేలా వారిని ప్రోత్సహించారు. ఇదంతా తనకు తెలియకుండా జరిగిందని గెహ్లాట్ బుకాయిస్తున్నా ఆయన మాటలను అధిష్ఠానం నమ్మడం లేదు. సీఎంకు తెలియకుండా ఎమ్మెల్యేలు, అదీ ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఇంత సీన్ క్రియేట్ చేయలేరంటున్నారు. దీంతో అశోక్ గహ్లోత్‌పై అధిష్ఠానం కన్నెర్రజేసింది.
రాజస్థాన్ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభం తీవ్రరూపం దాల్చడానికి కారణమైన గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించింది. వాస్తవానికి ఆయన బుధవారం(సెప్టెంబర్28) పార్టీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ వేయాల్సి ఉంది. అయితే రాజస్థాన్ లో సంక్షోభం కొలిక్కి వచ్చాకే నామినేషన్ వేయాలని అధిష్ఠానం ఆదేశించడంతో ఆయన నామినేషన్ కార్యక్రమం వాయిదా పడింది. నిజానికి అనూహ్యంగా ఆయన ధిక్కారం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఊహించిన ఎదురుదెబ్బగా పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
సరిగ్గా మూడు రోజుల కిందట గెహ్లాట్ కోచిలో రాహుల్ గాంధీని కలిశారు. ఆయనతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పట్ల తన విధేయతను ప్రదర్శించారు. అంతకు ముందు సోనియాగాంధీతో కూడా భేటీ అయ్యారు. ఆమె ఆదేశాల మేరకే రాజస్థాన్ సీఎం పదవిని వదులుకుని పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతానని మాటిచ్చారు. కానీ తిరిగి జైపూర్ వెళ్లిన వెంటనే ఆయన తన తిరుగుబావుటా ఎగురవేశారు. తన వర్గం ఎమ్మెల్యేలను అధిష్ఠానంపైకి ఉసిగొల్పి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికే కాకుండా అధ్యక్ష ఎన్నిక ముందు పార్టీలో కూడా సంక్షోభం ఏర్పడేందుకు కారణమయ్యారు. ఇప్పుడు ఆయనను పార్టీ అధ్యక్షుడిని చేస్తే అసలుకే మోసం వస్తుందని పార్టీ హై కమాండ్ భావిస్తోంది.
అలాగే సీడబ్ల్యుసీ కూడా పార్టీ అధ్యక్ష పదవికి ఆయన వద్దని సూచిస్తోంది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ మరో విధేయ నేత కోసం గాలిస్తోంది. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ఆదివారం జరగాల్సిన కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం రద్దైంది. తదుపరి సీఎంను నియమించే అధికారాన్ని సోనియాగాంధీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేయాలన్న అధిష్ఠానం ఆదేదాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు తిరస్కరించారు. గెహ్లాట్ వర్గీయులైన 83 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టడంతో సీఎల్పీ జరగలేదు. అయితే ఎమ్మెల్యేలు రాలేదు. మాజీ ఉపముఖ్యమంత్రి, తమ ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను సీఎంగా నియమిస్తామంటే అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు.
తమలో ఎవరో ఒకరిని సీఎం చేయాలని కండీషన్ పెట్టారు. అదే రోజు అంటే ఆదివారం(సెప్టెంబర్ 26) అర్ధరాత్రి దాటాకా స్పీకర్ సీపీ జోషీ నివాసానికి వెళ్లి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలు సమర్పించారు. రాజీనామాలు సమర్పించిన 83 మంది ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమయ్యేందుకు పరిశీలకులుగా వచ్చిన అధిష్టానం దూతలను మాకెన్, ఖర్గే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత సీఎం వర్గంలో కీలకమైన ఎమ్మెల్యేలు ప్రతా్‌పసింగ్ కచరియవాస్, మహేశ్ జోషీ, మంత్రి శాంతి ధరివాల్‌లు మకేన్, ఖర్గేలను సోమవారం (సెప్టెంబర్ 27) కలిశారు.
సంక్షోభ పరిష్కారానికి వారు మూడు డిమాండ్లు చేశారు. వాటిలో ప్రధానమైనది గెహ్లాట్ కు విధేయులుగా ఉన్న తమలో నుంచే ఎవరినో ఒకరిని సీఎంను ఎంపిక చేయాలన్నది. వారి డిమాండ్లను అధినేత్రి సోనియాకు నివేదిస్తామనీ, ఆమె నిర్ణయం తీసుకుంటారని అజయ్ మాకెన్ మీడియా సమావేశంలో తెలిపారు. ఆ వెంటనే మకేన్, ఖర్గేలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ సోనియాతో భేటీ అయ్యారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్‌ను సోనియా ఢిల్లీ పిలిపించి సంక్షోభ నివారణ బాధ్యతలు అప్పగించారు. రాజస్థాన్ సీఎంగా పైలట్ అంగీకరించేలా గెహ్లాట్ వర్గీయులను ఒప్పించాలని సోనియా కమల్ నాథ్ కు చెప్పారు. ఇలా ఉండగా ఎమ్మెల్యేలను రెచ్చగొట్టిన గెహ్లాట్ మాత్రం వారి తిరుగుబాటుతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. సీఎల్పీ భేటీకి ఎమ్మెల్యేలు రాకపోవడం సరికాదని అంటున్నారు. తాజా సంక్షోభానికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే పార్టీ మాత్రం ఆయనదంతా డ్రామా అని భావిస్తోంది. సీఎం అండ లేకుండా ఎమ్మెల్యేలు ఇంత రచ్చ చేయరని అంటోంది.
ఓ వైపు భారత్ జోడో యాత్ర జయప్రదంగా సాగుతూ కార్యకర్తలలో ఉత్తేజాన్ని నింపుతుంటే మరో పక్క కాంగ్రెస్ అధ్యక్షుడిగా తాము స్వయంగా ఎంపిక చేసి నిలబెడదామనుకున్న నేతే ధిక్కార స్వరం వినిపించడం పట్ల పార్టీలో ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం చేతులు దాటితే పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందనడానికి ఇదే తార్కానమని అంటున్నాయి. ఆ పరిస్థితి రాకుండా నివారించడానికి అధ్యక్షుడిగా తాము ఎంపిక చేయాలనుకున్న నాయకుడే ధిక్కార వైఖరి అవలంబించడంపై వారు ఆగ్రహంతో ఉన్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. గాంధీ కుటుంబం చేతిలో పార్టీ పగ్గాలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి రాజస్థాన్ పరిణామాలే తార్కాణమని.. అందుచేత ఇకనైనా మనసు మార్చుకుని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న ఒత్తిడి రాహుల్ పై పెరుగుతున్నట్లు చెబుతున్నారు.
ఒక దశలో పార్టీ అధ్యక్షుడిగా కమల్ నాథ్ ను పోటీలోకి దించాలని సోనియా భావించినా ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదంటున్నారు. గాంధీ కుటుంబం బయటి వ్యక్తులు పార్టీ అధ్యక్ష పగ్గాలు అందుకుంటే ముందు ముందు కాంగ్రెస్ లో ఇటువంటి సంక్షోభాలు మరిన్ని సంభవించే అవకాశాలున్నాయని పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఐక్యంగా ఉండాలన్నా, మరింత బలోపేతమై, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి దీటుగా నిలవాలన్నా రాహుల్ గాంధీ తన పంతం వీడి పార్టీ అధ్యక్ష పగ్గాలు అందుకోవాలని కోరుతున్నారు.