క్యాసినో కేసులో ఈడీ విచారణకు తెరాస ఎమ్మెల్యే
posted on Sep 27, 2022 @ 4:13PM
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణకు హాజయర్యారు. ఈడీ కార్యాలయంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం (సెప్టెంబర్ 26) విచారించారు.
ఈ కేసులో పలురంగాలతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాలలో క్యాసినో కేసు సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ కేసులో క్యాసినో సూత్రధారి చీకోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ అతడి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలకు ప్రమేయమున్నట్లు ఈడీ నిర్థారణకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు రాజకీయ నాయకులకు ఈ కేసులో ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసిందని చెబుతున్నారు.
అలా నోటీసులు అందుకున్నవారిలో తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ మంగళవారం(సెప్టెంబర్ 26) విచారించి ఆయన నుంచి స్టేట్ మెంట్ తీసుకుంది. క్యాసినో కేసు ఉభయ తెలుగురాష్ట్రాలలో రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఇరు రాష్ట్రాలలోనూ అధికార పార్టీకి చెందిన ప్రముఖుల ప్రమేయం ఉందన్న వార్తలు అప్పట్లో మీడియాలో హల్ చల్ చేయడంతో హై ప్రొఫైల్ కేసుగా ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టించింది