విభజన సమస్యల పరిష్కారం.. పురోగతి పూజ్యం.. నామ్ కే వాస్తేగా సమావేశాలు!
posted on Sep 27, 2022 @ 3:35PM
ఏపీ పునర్విభజన చట్టంలోని హామీల అమలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఎడతెగకుండా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. విభజన సమస్యల పరిష్కారం దిశగా కేంద్రం నిర్వహిస్తున్న సమావేశాలలో పురోగతి నత్తనడకను తలపిస్తోంది.
తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశా కీలక సమావేశం నిర్వహించింది. మంగళవారం (సెప్టెంబర్ 27) జరిగిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎస్ లు సోమేష్ కుమార్, సమీర్ శర్మ ల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల నుంచీ ప్రతినిథి బృందాలు హాజరయ్యాయి. ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా నేతృత్వంలో జరిగంది. ఈ సమావేశంలో చర్చకు రూపొందించిన అజెండాలో 14 అంశాలను పొందుపరచగా వాటిలో పలు అంశాలు అసలు చర్చకే నోచుకోలేదని తెలియవచ్చింది. ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్యా తరచూ వివాదానికి కారణమౌతున్న విద్యుత్ బకాయిల అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకే నోచుకోలేదని అధికార వర్గాల ద్వారా తెలిపింది.
అంతే కాక చర్చ జరిగిన అంశాలలో కూడా ఇరు రాష్ట్రాల మధ్యా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశం నిష్ఫలంగానే ముగిసిందని ఆ వర్గాలు తెలిపాయి. అంటే ఈ సమావేశం కూడా గత సమావేశాల లాగే ఏ సమస్యకూ పరిష్కారం చూపకుండానే ముగిసింది. తెలుగు రాష్ట్రాల సీఎస్ లు, వారి బృందాలూ కూడా తమ వాదనలకే కట్టుబడి ఉండటం, ఎదుటి వారి వాదనను వినే పాటి ఓపిక, ఆసక్తి కనబరచకపోవడంతో సమావేశం ఏ ప్రయోజనం లేకుండానే, ఏ పరిష్కారం కనుగొనకుండానే ముగిసిందని హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
అంతే కాకుండా మరో మారు సమావేశం అయ్యే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కూడా ఎటువంటి స్పష్టతా లేదని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.సమావేశంలో చర్చకు వచ్చిన ఏ అంశంపైనా కూడా ఇరు రాష్ట్రాల మధ్యా పరస్పర అంగీకారం కుదరలేదు. ఇక ఈ సమావేశంలో ఏపీ రాజధాని నిర్మాణం కోసం నిధులు కావాలని కోరగా ఇప్పటికే విడుదల చేసిన నిధుల వ్యయానికి సంబంధించిన లెక్కలు చెప్పిన తరువాతనే ఏపీ వినతిని పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
మొత్తం మీద విభజన సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతీ లేకుండానే కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాలు ముగుస్తుండటం పట్ల ఇరు రాష్ట్రాలలోనూ అసంతృప్తి వ్యక్తమౌతున్నది. విభజన చట్టంలో స్పష్టంగా ప్రస్తావించిన అంశాలను కూడా అమలు చేయలేకపోవడం కేంద్రం నిర్లక్ష్య వైఖరికీ, ఇరు రాష్ట్రాల మధ్యా సమస్యల పరిష్కారంలో మోడీ సర్కార్ చిత్తశుద్ధి లేమికీ నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.