పీఎఫ్ఐ పై ఐదేళ్ల బ్యాన్
posted on Sep 28, 2022 8:24AM
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్రం నిషేధం విధించింది. పీఎఫ్‌ఐతోపాటు దాని అనుబంధ సంస్థలను కూడా ఐదేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం తక్షణమే అమలులోనికి వస్తుంది. పీఎఫ్ ఐ, దాని అనుబంధ సంస్థలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
పీఎఫ్ఐపై దేశంలో ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల పీఎఫ్ఐపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఈడీ వరుసదాడులు నిర్వహించిన సంగతి విదితమే. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తోందన్న ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. ఈ నెల 22న, మళ్లీ 27(మంగళవారం) దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఎన్ఐఏ దాదాపు 300 మందిని అరెస్టు చేసింది.
యూపీ, గుజరాత్, ఢిల్లీ, మధ్య ప్రదేశ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని పీఎఫ్ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్ళలో జరిపిన సోదాలలో పలు కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. దేశంలో ప్రముఖుల హత్యకు, రాష్ట్రాలలో హింసాత్మక ఘటనలకు పీఎఫ్ఐ కుట్రపన్నిందని ఎన్ఐఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలైన రిహబ్ ఇండి ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహబ్ ఫౌండేషన్ కేరళపై ఐదేండ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
దేశంలో హింసకు పీఎఫ్ఐ కుట్రపన్నిందని బయట పడింది. దసరా ఉత్సవాల సందర్భంగా దేశంలో భారీ పేలుళ్లు చేపట్టడానికి పీఎఫ్ ఐ కుట్ర పన్నిందని ఎన్ఐఏ పేర్కొంది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన సంగతి తెలిసిన కొద్ది రోజు లకే బీజే పీ ఆర్ ఎస్ ఎస్ నేతలే లక్ష్యంగా వ్యూహ రచన జరిగినట్టు తెలిపింది. నాగ్‌పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పీఎఫ్ఐ రెక్కీ నిర్వహించిందనీ, నవరాత్రి ఉత్సవాల్లో భారీ కుట్రకు ప్లాన్ చేసిందనీ, పీఎఫ్ఐ హిట్ లిస్టులో దర్యాప్తు సంస్థ అధికారులు సైతం ఉందనీ ఎన్ఐఏ పేర్కొంది.