కేసీఆర్ జాతీయ పార్టీ కోసం రెండు టీవీ చానెళ్లు!
posted on Oct 4, 2022 @ 11:00AM
కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించే విషయాన్ని ఆషామాషీగా తీసుకోలేదని ఆయన చేతలు చెప్పకనే చెబుతున్నాయి. థర్డ్ ఫ్రంట్, ప్రత్యామ్నాయ కూటమి, కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి.. ఆ తరువాత కాంగ్రెస్ ను కలుపుకునైనా సరే బీజేపీయేతర కూటమి ఇలా గత కొంత కాలంగా అన్ని రకాలుగానూ కసరత్తు చేసిన కేసీఆర్ అవేవీ కలిసి రాకపోయేసరికి ఏకంగా తానే ఒక జాతీయ పార్టీని ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు.
కొత్త పార్టీ ఏర్పాటు ముహూర్తం ఖరారైపోయిన తరువాత ఆ పార్టీ గురించి ఆయన చేస్తున్న, చేసిన కసరత్తులు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.వాటిలో ప్రధానమైనది తన జాతీయ రాజకీయ పార్టీకీ, జాతీయ రాజకీయాలలో తన ప్రవేశానికి పెద్ద ఎత్తున ప్రచారం కోసం కేసీఆర్ స్వయంగా రెండు చానెళ్లు ప్రారంబించనున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆ చానెళ్లు పని చేస్తాయంటున్నారు. వాటిలో ఒకటి హిందీ చానెల్ కాగా, మరొకటి ఇంగ్లీష్ చానల్. కేవలం ప్రాంతీయ మీడియాను నమ్ముకుంటే.. తనకూ, తన పార్టీకి జాతీయ స్థాయిలో మైలేజీ ఉండదని బావించిన కేసీఆర్ తానే స్వయంగా చానల్ ప్రారంభించాలనీ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఢిల్లీ కేంద్రంగా పని చేసే ఈ రెండు చానెళ్లూ తన జాతీయ రాజకీయాలను విస్తృతంగా ప్రచారం చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు పని చేస్తాయని ఆయన చెబుతున్నారు.
వీటిని పార్టీ ఆవిర్బావాన్ని ప్రకటించే దసరా రోజునుంచే ప్రారంభించే అవకాశాలున్నాయని తెరాస వర్గాలు చెబుతున్నాయి. అయితే అదెంత వరకూ నిజమన్నది నిర్ధారణ కావలసి ఉంది. ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలో హిందీ, ఇంగ్లీషు బాషల్లో టీవీ చానెళ్లు ప్రారంభించనున్నట్లు కేసీఆర్ స్వయంగా ధృవీకరించలేదు.
ఇప్పటికే ప్రకటనల రూపంలో జాతీయ మీడియాలోనే కాకుండా, అన్ని రాష్ట్రాలలోని ప్రాంతీయ మీడియాలోనూ పెద్ద ఎత్తున తెలంగాణ ‘మోడల్’ అభివృద్ధి అంటూ ప్రచారం చేయించుకున్న కేసీఆర్, ఇప్పుడు సొంతంగా తన కొత్త జాతీయ రాజకీయ పార్టీ కోసం భారీ ఎత్తున రెండు చానెళ్లను ప్రారంభించడం అంటే.. పక్కా వ్యూహంతో, పకడ్బందీ ప్రణాళికతో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారనే అర్ధమౌతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఉద్యమ వార్తల ప్రచారానికి ఆయన నమస్తే తెలంగాణ పత్రికను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మీడియా ప్రచారం ద్వారానే ప్రజలలోకి వేగంగా వెళ్లగలమని కేసీఆర్ మొదటి నుంచీ విశ్వసిస్తున్నారు.
ఇప్పుడు కూడా ఆయన తన కొత్త పార్టీని వేగంగా ప్రజలలోకి తీసుకెళ్లేందుకే మన దేశం, మన చానెల్ అన్నట్లుగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో రెండు చానెళ్లను ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలూ పూర్తి చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ జాతీయ చానెళ్ల ద్వారా కేసీఆర్ జాతీయ అజెండా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించిన విజయాలు, దేశానికే ‘మోడల్’ అన్న గుర్తింపు పొందేలా అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమం తదితర అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఈ చానళ్ల సహకారంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలలో తన జాతీయ పార్టీకి మద్దతు దారులను పెంచుకోవడం, ప్రతి రాష్ట్రం నుంచీ తన పార్టీ రంగంలోకి దిగేందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.