బార్ అండ్ రెస్టారెంట్ పార్టీయేనా?.. బీఆర్ఎస్ ను స్వాగతిస్తూ మద్యం పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేత
posted on Oct 5, 2022 7:33AM
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించనున్న వేళ.. టీఆర్ఎస్ నేతలలో ఉత్సాహం ఉరకలేస్తున్నది. దసరా రోజు అంటే బుధవారం (అక్టోబర్ 5)న కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆయన జాతీయ రాజకీయాలలోకి ఎంట్రీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంబరాలు జరుగుతున్నాయి. కేసీఆర్ నిర్ణయానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సంబరాలు చేసుకుంటున్నారు. పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఈ ఆనందం వెర్రితలలు వేసింది. ఈ ఉత్సాహం గతి తప్పింది.
వరంగల్ లో ఒక టీఆర్ఎస్ నేత కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశానికి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయి ఏకంగా మద్యం బాటిళ్లు పంచారు. ఈ పని ఆయనేం రహస్యంగా చేయలేదు. ఒక ట్రాక్టర్ ట్రాలీలో మద్యం సీసాలను తీసుకువచ్చి నడి రోడ్డు మీద అదేదో సామాజిక సేవలా.. మద్యం సీసాలను పంచారు. అంతేనా మద్యంలోకి మంచింగ్ కోసం ఇంటికి తీసుకెళ్లి కూరొండుకోండన్నట్లు కోళ్లనూ పంచారు. ఈ పంపిణీ అంతా ఆయన వెనుక రెండు కటౌట్లను పెట్టుకుని మరీ చేశారు. ఇంతకీ ఆ కటౌట్లు ఎవరివో తెలుసా.. ఒకటేమో సీఎం కేసీఆర్ ది. రెండోది ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ ది. ఆయన పంపిణీ చేస్తున్న మద్యం బాటిళ్లు, కోళ్లను తీసుకోవడం కోసం జనం క్యూలో నిలుచున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.
ఈ మద్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన టీఆర్ఎస్ నేత పేరు రాజనాల శ్రీహరి. వరంగ్ కు చెందిన టీఆర్ఎస్ నేత. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడు సందర్భంగా వరంగల్‌కు చెందిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి.. తమ నేత కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం సీసాలను ఉచితంగా పంపిణీ చేశారు.
అధికార పార్టీ నేతే మద్యం పంపిణీ చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం రాజనాల శ్రీహరి చర్యను సమర్ధిస్తున్నారు. రాజనాల శ్రీహరి దసరా కానుకగా హమాలీలకు కోళ్లు, లిక్కర్ బాటిల్స్ ఇచ్చారని వెనకేసుకొస్తున్నారు.
అయితే విపక్షాలు, స్థానికులు మాత్రం రాజనాల శ్రీహరి చర్యను తప్పుపడుతూ.. కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అనడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మద్యం పంపిణీ ఘటనతో ఆమె విమర్శలు సరైనవేననిపిస్తోందని అంటున్నారు.