బీఆర్ఎస్.. కేసీఆర్ పాన్ ఇండియా మూవీ.. ఖర్చుకు తగ్గేదేలే
posted on Oct 4, 2022 @ 10:56PM
కేసీఅర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఒక పాన్ ఇండియా మూవీలా విడుదల కాబోతోంది. ఖర్చుకు తగ్గేదేలే అంటూ చేతికి ఎముక లేదన్నట్లుగా డబ్బులు వెదజల్లుతున్నారు. నిర్మాత ఎక్కడా వెనకాడకుండా, రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట,పది రూపాయలు ఖర్చుపెట్టి, సినిమాను చాలా రిచ్ గా తీశారు. సెట్స్ కాస్ట్యూమ్స్ ఒకటనేమిటి 24 ఫ్రేమ్స్ లో లక్ష్మీదేవి గలగలు కనిపిస్తాయి. వినిపిస్తాయి. ఇంతవరకు, నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ హిస్టరీలో ఇలా చేతికి ఎముక లేదన్నట్లుగా ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సినిమా తీసిన నిర్మాతను చూడలేదు. సహజంగా నటీనటులు, దర్శకులు సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాతను ఇలాగే పొగిడేస్తుంటారు. సరే, చివరకు ఆ సినిమా హిట్టా, ఫట్టా, నిర్మాత పరిస్థితి ఏమిటి, అనేది పక్కన పెడితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ వేదిక కోసం చేస్తున్న సన్నాహాలు, సినిమా బాబుల డాబులను మించి పోతున్నాయని అంటున్నారు.
ఇప్పటికే, దేశం మొత్తం చుట్టి వచ్చేందుకు దేశంలో ఏ పార్టీకీ లేని విధంగా రూ.80 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఏకంగా ఛార్టర్డ్ ఫ్లైట్ ను సిద్ధం చేసుకున్నారు. ఇక ప్రకటనల ఖర్చు, టీవీ స్లాట్స్ కు ఎన్ని వందల వేల కోట్లు ఖర్చు చేస్తున్నారో లెక్క లేదు. అదిగో పైన ఆ నిర్మాత గురించి నటీ నటులు చెప్పినట్లు, చేతికి ఎముక లేదన్నట్లుగా, తగ్గేదే లే అంటూ దేశం మొత్తం ధూమ్ ..ధామ్..గా ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. డబ్బుల మూటలు కదిలిపోతున్నాయి., అంటున్నారు. కేసీఆర్ ను జాతీయ హీరోను చేసేందుకు కటవుట్లు, హోర్డింగులు, ఒకటనేమిటి దేశాన్ని గులాబీ మయం చేసందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.
అదొకటి అలా ఉంటే కేసీఆర్ సొంత విమానంతో పాటుగా సొంతంగా జాతీయ స్థాయిలో ఒక రెండు టీవీ చానెల్స్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తునట్లు తెలుస్తోంది. కేసేఆర్ ఆలోచన చేస్తున్నారు అంటే అది ఆయిపోనట్లే. కేసీఆర్ ను ప్రధానిగా, కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఏ వీరభిమానో, రేపు ఈ జేబులోంచి ఓ వంద కోట్లు, ఆ ప్యాకెట్ లోంచి మరో వంద కోట్లుతీసి భక్తిగా సమర్పించుకుంటే, రెండేమి ఖర్మ ఏకంగా నాలుగు చానల్స్, స్టార్ట్ చేసినా చేస్తారు. కేసీఆర్ కళ్ళలో ఆనందాన్ని చూసేందుకు, వీరాభిమానులు క్యూ కడుతున్నప్పుడు, ప్రభుత్వ విప్ వినయభాస్కర్ చెప్పినట్లు ఛార్టర్డ్ ఫ్లైట్స్ టీవీ చానల్స్, పత్రికలు, ఫ్రీ పుబ్లిసిటీ అసలు ఇష్యూనే కాదు అంటున్నారు.
అయితే, కేవలం డబ్బులు కుమ్మరిస్తే జాతీయ నాయకుడు అయిపోతారా? అలా ఆనుకుంటే కేసీఆర్ ను తక్కువ చేయడం కాదు కానీ, ఆయనను మించిన కుబేరులు దేశంలో చాలా మందే ఉన్నారు. నిజమో కాదో తెలియదు గానీ సోనియా గాంధీ కూడా ప్రపంచలోనే అత్యంత ధనిక మహిళా రాజకీయ నాయకులలో ఒకరని ఒకప్పుడు ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అతి కనిష్ట స్థాయికి, 50 సీట్లకు పడి పడిపోయింది.
నిజమే రాజకీయాల్లో రాణించేందుకు ఛార్టర్డ్ ఫ్లైట్స్, టీవీ చానల్స్, పత్రికలు, సొంత మీడియా అవసరమే కానీ, కేవలం డబ్బులనే నమ్ముకుంటే, ఏమవుతుందో చెప్పేందుకు హుజురాబాద్ అనుభవం ఒక్కటి చాలు వేరే ఉదాహరణలు అవసరం లేదు అంటున్నారు. అలాగే, తెలంగాణ ఉద్యమం డబ్బులతో సక్సెస్ కాలేదు. నిజానికి ఈ రోజు తెరాస ఖాతాలో ఉన్న సోమ్ముల్లో ఒక్క శాతం కూడా ఆ రోజు లేవని అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే కేసీఆర్ కు ఇవ్వన్నీ తెలియవా అంటే తెలియక కాదు అయినా, అయన తెగ్గేదేలే .. అంటున్నారని అంటున్నారు. అందుకే కేసేఅర్ జాతీయ చిత్రం హిట్టా ..ఫట్టా అనేది అప్పుడే తేలదని అంటున్నారు.