రూసో, డీకాక్ బాదుడుతో దక్షిణాఫ్రికా విజయం
posted on Oct 4, 2022 @ 11:38PM
సిరీస్ భారత్ గెలవచ్చుగాక, చివరి మ్యాచ్ లో మాత్రం రూసో, డీకాక్, మిల్లర్ సిక్స్‌లు, ఫోర్లు ఎలా కొట్టాలి, స్కోర్ ఎలా పరుగు లెత్తిం చాలన్నది చేసి చూపారు. భారత్ జట్టులో కింగ్ కోహ్లీ స్థానంలో వచ్చిన సిరాజ్, రాహుల్ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ విఫలమయ్యారు. మనవాళ్లు పేకముక్కలు పడినట్టు టాప్ ఆర్డర్ మొత్తం తక్కువస్కోర్‌కే వెనుదిరగడం దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌లో ఎంతగా పటిష్టత ప్రదర్శించింది స్పష్టం చేస్తుంది. చెప్పి వికెట్లు తీసినట్టు తీశారు. ఇండోర్‌లో జరిగిన టీ20లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేయగా భారత్ 178కి ఆలౌట్ అయింది. చిత్రమేమంటే ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కెప్టెన్లు నిరాశపర్చడం.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బవూమా మళ్లీ విఫలమయ్యాడు. ఒక వంక డీకాక్ బాదుడు ఆరంభించగానే మూడో ఓవర్లోనే బవూమా కేవలం 3 పరుగులకే వెనుదిరిగాడు. మొదటి ఆరు ఓవర్లకి ఒక వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. అక్కడి నుంచి రూసో, డీకాక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బ్యాటింగ్ ప్రదర్శించారు. ప్రతీ బౌలర్‌ని సిక్స్‌లు, ఫోర్లు బాదారు. ఫీల్డింగ్ కూడా భారత్ అంతంత మాత్రంగానే సాగిందనాలి. క్యాచ్‌లు వదిలారు, ఫీల్డింగ్ చాలా పేలవంగా అనిపించింది. ఏ బౌలర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. సిరాజ్ మీద పెట్టుకున్న ఆశలు పెద్దగా నెరవేరలేదనాలి. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్లోనే వంద పరుగులు పూర్తి చేసుకుంది అప్పటికి డీకాక్ అర్ధసెంచరీ చేశాడు. 14వ ఓవర్‌కి రూసో అర్ధసెంచరీ 27 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్స్‌లతో 50 పరుగులు పూర్తి చేశాడు.13వ ఓవర్లో డీకాక్ చిత్రంగా రనౌట్ అయ్యాడు. అప్పటికి అతను 43 బంతుల్లో 68 పరుగులు చేశాడు. కానీ సిరాజ్‌ను, హర్షల్‌ను మరో వంక రూసో చితకబాదుతూనే జట్టు స్కోర్‌ను పరుగులెత్తించాడు. 16వ ఓవర్ వేసిన చాహర్ 15 పరుగులిచ్చాడు.18ఓవర్‌కి రూసో సెంచరీ కేవలం 48 బంతుల్లో పూర్తి చేశాడు. అందులో 8సిక్స్‌లు 7 ఫోర్లు ఉండటం అతని బ్యాటింగ్ ధాటిని తెలియజేస్తుంది. చివర్లో వచ్చిన డేవిడ్ మిల్లర్ చివరి ఓవర్లో మూడు సిక్స్‌లు కొట్టి బౌలర్లను బయపెట్టాడు! ఇన్నింగ్స్ ముగిసే సమయానికి రూసో సెంచరీతో, మిల్లర్ 19 పరుగులతో అజేయంగా ఉన్నారు. రన్ రేట్ 11.36 ఉంది.
228 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్, పంత్ ఓపెన్ చేశారు. రబాడా వేసిన తొలిఓవర్ రెండో బంతికే కెప్టెన్ శర్మ వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన అయ్యర్ రెండో ఓవర్లో పార్నల్ కి దొరికాడు. అప్పటికి జట్టు స్కోర్ కేవలం 4 పరుగులే! ఏదో శనిపట్టినట్టు ఒకరి తర్వాత ఒకరు అలా పెవిలియన్ దారి పట్టి ప్రేక్షకులను, టీమ్ ఇండియా వీరాభిమానులను ఎంతో నిరాశపరిచారు. 5ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. మొన్నటి రెండు మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించిన సూర్యకుమార్ యాదవ్ రాగానే వచ్చాడ్రా మనోడు ఇరగదీస్తాడు ఫో.. అనుకున్నారు. కానీ అలాగేమీ జరగలేదు.ఊహించనివిధంగా వెనుదిరిగాడు. అయితే మరో వంక దినేష్ కార్తీక్ ధాటిగా ఆడుతూండడంతో జట్టు స్కోర్ 7 ఓవ ర్లలో 78కి చేరుకుంది. అదే ఓవర్లో డి.కె అవుటయ్యాడు. అతను 21 బంతుల్లో 46 పరుగులు చేశాడు. 9ఓవర్ చాలా చిత్రంగా సాగింది. మహారాజ్ వేసిన ఆ ఓవర్లో హర్షల్ రెండుపర్యాయాలు ఒకే బంతికి అవుటవడం తప్పించుకున్నాడు. క్యాచ్ బవుమా వదిలేసేడు, రన్ అవుట్ చేయడంలో ఫీల్డర్ బంతి చేజారడంలో హర్షల్ బతికిపోయాడు. భారత్ అలా పడుతూ లేస్తూ పది ఓవర్లకి 5 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.
ఇదే సమయానికి దక్షిణాఫ్రికా 1 వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. మరి రెండు బంతులకు భారత్ వంద పరుగులు పూర్తి చేసింది. తర్వాత హర్షల్ (17)వెనుదిరిగాడు. భారత్ 12 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్ చివరి దశలో ఉమేష్, ఛాహర్‌లో కాస్తంత బాగా ఆడారు. దీంతో 15 ఓవర్లకి భారత్ స్కోర్ 142కి చేరుకుంది. అప్పటికి చాహర్ 24, ఉమేష్ 9 పరుగులు చేసారు. చాహర్ 17 బంతుల్లో 31 పరుగులు చేసి 17 ఓవర్లో వెనుదిరిగాడు. తర్వాత ఉమేష్ విజృంబించడంతో భారత్ 19 ఓవర్లకు 178 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 49 పరుగులతో విజేత అయింది.
కాగా మొత్తం సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించి, అందరి మన్ననలూ అందుకున్న స్టార్ బ్యాట్సమన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాన్ ఆవఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు.