ఉచితాలకు ఈసీ ముకు తాడు
posted on Oct 4, 2022 @ 11:06PM
ఒకప్పటికీ ఇప్పటికీ రాజకీయాల రంగు, రుచి, వాసనా పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సంక్షేమ పథకాలంటే, పేద, బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే, అది కూడా కూడు, గుడ్డ, నీడకు మాత్రమే పరిమితంగా ఉండేవి. కానీ, ఇప్పుడు అన్నీ ఉచితాలే. అందరికీ ఉచితాలే. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చివరకు ముఖ్యమంత్రులు, వందల ఎకరాలున్న భూస్వాములకు కూడా రైతు బంధు, ఉచిత విద్యుత్, వంటి పథకాలు అమలవుతున్నాయి.
అలాగే, రాజకీయ పార్టీలు సంక్షేమం పేరిట ఉచిత పథకాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాయి. ఉదాహరణకు ఆంధ్ర పదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా 85 శాతం మంది ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందుతోందని, ఇంతవరకు మీట నొక్కి ఒక లక్షా 60 వేల కోట్ల రూపాయలను ప్రజల ఖాతాల్లో వేశామని అందుకే ప్రజలంతా తమకే ఓటు వేస్తారని, 175కి 175 సీట్లు గెలుచుకుంటామని చెపుతున్నారు.
ఈ నేపధ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఉచితాలకు సంకెళ్ళు వేసే దిశగా మరో అడుగు ముందుకు వేసింది .
నిజానికి, ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం కూడా ఉచిత వరాల విషయంలో హేతుబద్దత అవసరమని సూచించింది. కాగా తాజగా కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలు ఇచ్చే ఉచిత తాయిలాలకు అయ్యే ఖర్చు, దాని అమలు సాధ్యాసాధ్యాలపై ఓటర్లకు ప్రామాణికమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించింది. ఈ మేరకు దేశంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ రాసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల జాబితా, వాటిని ఎలా నెరవేరుస్తారు, అందుకు ఉన్న ఆర్థిక వనరులు ఏంటో పార్టీలు స్పష్టంగా ఓటర్లకు తెలియజేయాలని లేఖలో ఈసీ సూచించింది.
ఉచిత హామీల అమలుపై తగినంత స్పష్టత లేకపోతే అది ఆర్థిక సుస్థిరతను దెబ్బతీసే ప్రమాదాన్ని కొట్టిపారేయాలేమని ఈసీ అభిప్రాయపడింది. ఉచిత హామీలకు సంబంధించి అనుసరించాల్సిన ఒక ఉమ్మడి ఫార్మాట్‌ను ఈసీ.. పార్టీలకు పంపింది. అలాగే 2015 ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలు, వాటిని నెరవేర్చిన వివరాలు అందించాలని ఈసీ కోరింది. వాటిపై ఈనెల 19 లోపు సమాధానం ఇవ్వాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బలోపేతం చేయడానికి.. రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని ఈసీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. నిజానికి, సంక్షేమం గీత దాటి సంక్షోభంలోకి దారి తీస్తున్న పరిస్థితిలో ఉచితాల పై సమగ్ర చర్చ అవసరమని ఆర్థిక నిపుణులు ఏప్పటి నుంచో సూచిస్తున్నారు.