సూర్యకుమార్ యాదవ్ కొడితే రికార్డులు బద్దలైపోవాలంతే!
posted on Nov 20, 2022 @ 11:01PM
టి20 స్పెషలిస్ట్ ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ దుమ్ము దులుపుతున్నాడు. ఇప్పటి వరకూ కేవలం 41 టి20 మ్యాచ్ లు మాత్రమే ఆడిన సూర్యకుమార్ పలు అరుదైన రికార్డులు సృష్టించాడు. తాజాగా న్యూజిలాండ్ పై ఆదివారం జరిగిన టి20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్లో శతకబాదాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అతడి ఖాతాలో జమయ్యాయి.
ఆదివారం (నవంబర్ 20) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లుతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతడి ఖాతాలో రికార్డులు సృష్టించాడు. తన కెరీర్‌లో రెండో శతకం బాదిన సూర్యకుమార్ యాదవ్ ఈ క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
న్యూజిలాండ్ గడ్డపై టీ20ల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఒకే క్యాలెండర్ ఇయర్ లో టి20లలో రెండు శతకాలు కొట్టిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. 2018లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.
ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున అత్యధిక శతకాలు బాదిన కేఎల్ రాహుల్ రికార్డును సమయం చేశాడు. రాహుల్ 72 మ్యాచుల్లో రెండు శతకాలు చేయగా సూర్య 41 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు. నాలుగు సెంచరీలతో రోహిత్ శర్మ ఈ జాబితాలో అందరి కంటే ముందు ఉన్నాడు.
ఒక క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్థశతకాలు(11) చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్(10) ను అధిగమించాడు. పాక్ కే చెందిన మహ్మద్ రిజ్వాన్(13) ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. ఇలా ఉండగా సూర్యకుమార్ టి20 మ్యాచ్ లలో సాధించిన రెండు శతకాలు కూడా విదేశాల్లో చేసినవే. ఇలా రెండు సెంచరీలు విదేశాల్లో చేయడం కూడా ఓ రికార్డే.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ నేటి మ్యాచ్‌తో కలిపి 41 మ్యాచులు ఆడాడు. 39 ఇన్నింగ్స్‌లో 181.64 స్ట్రయిక్ రేట్‌తో 45 సగటున 1395 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 12 అర్థశతకాలు ఉన్నాయి.