వనభోజనాల్లో రికార్డింగ్ డ్యాన్స్.. అదీ ప్రభుత్వ పాఠశాలలో!
posted on Nov 21, 2022 8:51AM
వన భోజనాల్లో రికార్డింగ్ డ్యాన్స్.. అదీ ఒక ప్రభుత్వ పాఠశాలలో.. చిన్నారుల చదువుల గుడిలో.. వారి ఆటపాటలు మాత్రమే కనిపించాలి. అలాంటిది ఓ సామాజిక వర్గానికి చెందిన వారు వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు.
వనభోజనాలంటే అయిన వారంతా సరదాగా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటారు. కలిసి భోజనం చేస్తారు అనుకుంటాం. కానీ వీరు అలా కాదు.. ఏకంగా అసభ్య నృత్యాలతో ఒక రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమమే పెట్టేశారు. రికార్డింగ్ డ్యాన్స్ లో భామలు డ్యాన్సులు చేస్తుంటే.. వనభోజనాలకు వచ్చిన వారు వారితో కలిసి కాలు కదిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులోని ఒక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన తతంగమిది. అసలు ప్రభుత్వ పాఠశాలలో వనభోజనాలు నిర్వహించడానికి అధికారులు పర్మిషన్ ఇచ్చారా? ఒక వేళ ఇస్తే ఎలా ఇచ్చారు. సరస్వతి నిలయమైన పాఠశాలలో రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తుంటే జాల్లా యంత్రాంగం ఏం చేస్తోంది? అధికార గణం ఈ అశ్లీల నృత్యాలు.. అదీ ఒక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరుగుతుంటే.. అలా జరుగుతున్నాయని సమాచారం అందినా నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఊరుకున్నారు? అధికార పార్టీ వారి ఆధ్వర్యంలో జరిగింది కనుక తమకెందుగొచ్చిన గొడవలే అని ఊరుకున్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అధికార పార్టీకి చెందిన వారైతే ఏం చేసినా చేసేయొచ్చా? అని నిలదీస్తున్నారు. ఇటీవల ఏపీలోనే అయ్యప్ప పడి పూజను అడ్డుకున్న పోలీసులకు రికార్డింగ్ డ్యాన్సులను అడ్డుకోవాలని అనిపించలేదా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా.. ఏకంగా అశ్లీల నృత్యాలతో రికార్డింగ్ డ్యాన్సునే ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యార్థల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.