గుజరాత్ లో బీజేపీకి రెబల్స్ బెడద
posted on Nov 20, 2022 @ 10:48PM
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి రెబల్స్ బెడద పెద్ద తలనొప్పిగా మారనుంది. గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల మొదటి వారంలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీకి గుజరాత్ లో ఆప్, కాంగ్రెస్ లు గట్టి పోటీని ఇస్తున్నాయి. గుజరాత్ లో ఎలాగైనా సరు వరుసగా ఏడో సారి అధికారంలోకి రావాలన్నపట్టుదలతో ఉన్న బీజేపీ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. దీంతో ఆ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువైంది. బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించడం లేదు. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 1న జరగనుండగా..ఆ ఎన్నికలకు 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ రెబల్ అభ్యర్థులుగా రంగంలోకి దిగారు.
వారిని బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా స్వతంత్ర అబ్యర్థులుగా నిలబడిన ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు పాల్పడినందుకు, క్రమశిక్షణా రాహిత్యం కింద ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ చెప్పారు.
పార్టీ నుంచి బహిష్కృతులైన వారిలో హర్షద్ వాసవ, అరవింద్ లదాని, ఛత్రాసింగ్ గుంజారియా, కేతన్ భాయ్ పటేల్, భరత్ భాయ్ చావ్‌డా, ఉదయ్ భాయ్ షా, కరన్ భాయ్ బరైయా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరుపున పోటీ చేసే 160 మంది అభ్యర్థుల జాబితాను ఇటీవలే బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో 38 కొత్త ముఖాలు ఉన్నాయి. 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వగా.. 42 మందికి మాత్రం నిరాకరించింది.
మాజీ సీఎం విజయ్ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌లకు కూడా టికెట్ ఇవ్వలేదు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. గుజరాత్ జామ్‌నగర్ నార్త్ విధానసభ స్థానం ఆమె పోటీ చేయనుంది. గుజరాత్ రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. డిసెంబర్ 1న తొలి దశ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.