బర్త్ డే పార్టీలో గెస్ట్ ల విషయంలో గొడవ.. ఐదుగురు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
posted on Nov 20, 2022 @ 10:29PM
హాస్టల్ లో ఓ విద్యార్థిని బర్త్ డే పార్టీకి వచ్చిన అతిథుల విషయంలో జరిగిన గొడవ ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి దారి తీసింది.
వరంగల్ జిల్లా ఆరేపల్లి రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకుంటున్నటెన్త్ విద్యార్థిని బర్త్ డే పార్టీ జరిగింది. ఆ బర్త్ డే పార్టీకి హాస్టల్ విద్యార్థినుల కన్నా బయటి వారే ఎక్కువ మంది రావడంపై హాస్టల్ అధికారులు విద్యార్థినులను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
హాస్టల్ లో ఉన్న ఫినాయిల్ తాగేశారు. తొటి విద్యార్థులు అధికారులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు కోలుకుంటున్నారు. విద్యార్థినులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.