రిట్రెంచ్ మెంట్ ఇక గూగుల్ వంతు
posted on Nov 23, 2022 @ 10:01AM
ఆర్థిక మాంద్యం ఐటీ ఉద్యోగుల ఉద్యోగాలకు ఎసరు తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. సంస్థలు తమ నష్టాలను తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. ఇప్పటికే ఎలాన్ మస్క్ ఉద్యోగులకు ఉద్వాసన పలకడంలో ఇప్పటి వరకూ ఎ సంస్థా చేయని విధంగా దూకుడుగా వ్యవహరిస్తుంటే.. అమెజాన్, మెటా వంటి అగ్రశ్రేణి సంస్థలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలకడమే నష్టాలను పూడ్చుకునే మార్గంగా భావించి ఆ దారిలో నడుస్తున్నాయి.
ఎలాన్ మస్క్ అయితే ఇప్పటి వరకూ సంస్థలో 50 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. వీరు కాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఇంటిదారి చూపారు. అమెజాన్ సైతం తన సంస్థలో పది వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఇక ఫేస్ బుక్ మాతృ సంస్థ అయిన మెటా సైతం ఉద్యోగుల కోతకే సై అంది. ఆ దారిలోనే నడుస్తోంది. మొత్తంగా ఐటీ ఇండస్ట్రీలోనే ఈ ఉద్వాసన ట్రెండ్ మొదలైంది. తాజాగా గూగుల్ కూడా అదే బాట పట్టడంతో ఐటీ ఉద్యోగులలో టెన్షన్ ద్విగుణీకృతమైంది.
ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి ఫ్రెషర్స్ వరకూ అందరిలోనూ ఆందోళన నెలకొంది. వర్క్ ఫెర్ఫార్మెన్స్ నెపంతో కనీసం పది వేల మందిని దశల వారీగా తొలగించేందుకు గూగుల్ నిర్ణయించుకుంది.
ఐటీ రంగంలో ఉద్యోగులకు భారీగా వేతనాలు చెల్లించే కంపెనీల్లో గూగుల్ అందరి కంటే ముందుంది. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ కంపెనీగా పేరున్న గూగుల్ సైతం లేఆఫ్స్ బాటను ఎంచుకోవటంతో మొత్తంగా ఐటీ ఉద్యోగులలో జాబ్ ఫియర్ మొదలైంది. ఉద్యోగ భద్రత కరవైందన్న భావన వారిలో నెలకొంది.