కర్మకాండలు నిర్వహించే కంపెనీ వెలిసింది!
posted on Nov 23, 2022 5:44AM
సంపాదన కోసం చట్ట విరుద్ధం కాని ఏ పనైనా చేయడానికి సిద్ధపడటాన్ని ఎవరూ తప్పు పట్టరు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని మనవాళ్లు ఎప్పుడో చెప్పేశారు. కానీ... విలువల వలువలు ఊడ్చిసి.. బంధాలు, బంధుత్వాలను తెంచేసి.. డబ్బులు పారేస్తే ఏ సేవలైనా మీ కాళ్ల వద్దకు వచ్చేస్తాయనే లాంటి వ్యాపారాలు చట్ట చట్ట విరుద్ధం కాకపోయినా.. నైతిక కోణంలో అంగీకరించలేం.
అలా నైతికంగా ఆమోదయోగ్యం కాని ఓ స్టార్టప్ పుట్టుకొచ్చింది.అదే కర్మ కాండలు చేసే ఓ కంపెనీ. ‘సుఖాంత్ ఫ్యునరల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో వెలిసిన ఈ కంపెనీ.. కర్మకాండలతోపాటు అంబులెన్స్ సర్వీస్, మరణ ధ్రువీకరణ పత్రం పొందేందుకు సాయం చేయడం వంటి సేవలు అందిస్తామంటోంది. కర్మకాండలు నిర్వహించేందుకు ఈ స్టార్టప్ రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తుందట.
ఇప్పటికే మనిషిని రోబోగా మార్చేసి డబ్బులు పారేసే ఈ సేవ అయినా కాళ్ల దగ్గరకు చేర్చేలా వ్యాపారాలు, వ్యాపార సంస్థలూ పుట్టుకొచ్చేశాయి. సంపాదనే ధ్యేయంగా నీరు, గాలి, తిండి ఇలా ప్రతీదీ వ్యాపారానికి కాదేదీ అనర్హం అన్న పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా కర్మ కాండలు చేయడానికీ ఓ కంపెనీ ముంబైలో వెలిసింది. ముంబైలో ప్రారంభమైన ఈ స్టార్టప్ వ్యాపారం ఏడాదిలో ఐదు కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు.
ఇప్పటికే డబ్బులు కట్టి తల్లిదండ్రులను ఓల్డేజ్ హోంలకు తరలించేస్తున్న వారెందరో ఉన్నారు. ఇప్పుడు ఇక మరణానంతర క్రతువులను కూడా ఇలా తమ ప్రమేయం లేకుండా.. లాస్ట్ రెస్పెక్ట్ కు కూడా తిలోదకాలిచ్చేయడాన్ని ప్రోత్సహించేలా ఓ కంపెనీ వెలిసింది. దీనిపై సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటి కంపెనీలు మనకు అవసరమా అంటున్నారు. మనిషి అంతిమ యాత్ర అయిన వారి కన్నీటి వీడ్కోలుతో జరగాలి తప్ప ఇలా కాదని అంటున్నారు. డబ్బు సంపాదన కోసం మానవ సంబంధాలను, అనుబంధాలను విచ్ఛిన్నం చేసే ఇలాంటి వ్యాపారాలు తగవని హితవు చెబుతున్నారు.