తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు !
posted on Nov 22, 2022 @ 9:41AM
తెలంగాణలో తెరాస నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలేలక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలుదూకుడె పెంచాయి. ఒక వైపు మద్యం కుంభకోణంలో ఈడీ వేగంపెంచగా, మరో వైపు చీకోటి ప్రవీణ్ కేసీనో కేసులో కూడా ఈడీ దర్యాప్తులో దూకుడు చూపుతోంది. మరో వైపు ఐటీ కూడా వేగం పెంచింది. తాజాగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంపై ఐటీ దాడులు చేసింది. మంగళవారం ఉదయం నుంచే మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై దాడులు ప్రారంభమయ్యాయి. అంతే కాకుండా మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి నివాసాలూ, కార్యాలయాల్లో కూడా ఐటీ శాఖ దాడులు చేస్తోంది. కుమారుడికి చెందిన సికింద్రాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీలో ఐటీ సోదాలు చేస్తోంది. మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
ఇంకా హైదరాబాద్‌లో మల్లారెడ్డికి చెందిన బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. మొత్తం 50 బృందాలుగా వచ్చిన ఐటీశాఖ అధికారులు ఏక కాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి కుటుంబంపైనే కాకుండా నగరంలోని పలువురి ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
కొంపల్లిలోని పాం మెడోస్ విల్లా, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తెరాసలో కలకలం రేపుతున్నాయి. ఇటీవలె కరీంనగర్‌లో మంత్రి గంగుల కమాలకర్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ అధికారులు ఉమ్మడి సోదాలు నిర్వహించగా.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఇప్పుడు ఇలా మల్లారెడ్డి ఇంటిపై కూడా అటాక్ చేయడం తెరాసలో కలకలం రేపుతోంది. మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి కుమార్తె, కుమారుడు, అల్లుడి నివాసాలలో కూడా దాడులు జరుగుతున్నాయి.
ఇటీవల తెరాస విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఆ సందర్భంగా తెరాస నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలపై కూడా ఐటీ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉన్నాయి. అయినా ఎవరూ భయపడొద్దు అని చెప్పిన సంగతి తెలిసిందే. తెరాస నేతల్లో నైతిక స్థైర్యం దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ కక్షసాధింపునకు పాల్పడుతోందని కేసీఆర్ ఆ సందర్భంగా అన్నారు. ఇప్పుడు వరుసగా తెరాస నేతలు లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడంతో కేసీఆర్ చెప్పిందే జరుగుతోందేని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.