సెక్స్ వర్కర్లు, ట్రాన్స్‌జెండర్లు ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం
posted on Nov 23, 2022 @ 9:50AM
సెక్స్ వర్కర్లు మరియు ట్రాన్స్‌జెండర్లు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి మరియు మారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ వికాస్ రాజ్ మంగళవారం తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న 52 ఎన్జీవోలు హాజరైన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఈవో ప్రసంగించారు. స్పెషల్ సమ్మరీ రివిజన్(SSR) కార్యక్రమంలో భాగంగా ఇంకా నమోదు చేసుకోని సెక్స్ వర్కర్ల చేత ఓటు నమోదు చేయించాలని ఎన్జీవోలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళా సెక్స్ వర్కర్లు, ట్రాన్స్‌జెండర్లు వంటి అత్యున్నత గ్రూపులతో హెచ్‌ఐవీ నివారణపై పనిచేస్తున్న ఎన్జీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నివాస స్థలానికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంటరీ రుజువు లేని సెక్స్ వర్కర్లను డాక్యుమెంటరీ రుజువు కోసం పట్టుబట్టకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిందని తెలిపారు. అలాంటి పక్షంలో బూత్ లెవల్ అధికారి, ఫారమ్-6 లో పేర్కొన్న చిరునామాను సందర్శించి ఆ స్థలంలో నివసిస్తున్నారో లేదో నిర్ధారించుకొని, నివేదికను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి సమర్పిస్తారని పేర్కొన్నారు.
అనంతరం ట్రాన్స్‌జెండర్ల సంఘంతో జరిగిన సమావేశంలో, అర్హులైన ట్రాన్స్‌జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా వారు ఓటు నమోదు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు సభ్యులతో పాటు ట్రాన్స్‌జెండర్లతో కలిసి పనిచేస్తున్న ఎన్జీవోల నుండి సీఈవో సూచనలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని ట్రాన్స్‌జెండర్లను నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
మంగళవారం జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ట్రాన్స్‌జెండర్ బోర్డు సభ్యులతో పాటు శిశు మరియు మహిళా సంక్షేమ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.