కొత్త సచివాలయానికి బీటలు!?
posted on May 1, 2023 @ 2:32PM
కొత్త సచివాలయం.. తెలంగాణ ఠీకీకి నిలువెత్తు నిదర్శనమంటూ బీఆర్ఎస్ గొప్పగా చెప్పుకుంటున్న నూతన సెక్రటేరియెట్ బండారం ఒక వర్షంతో బట్టబయలైపోయింది. కొత్త సచివాలయానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంతో ఘనంగా ఆదివారం (ఏప్రిల్ 30) ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం జరిగిన గంటల వ్యవధిలోనే సచివాలయానికి బీటలు వచ్చాయి. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం సచివాయలం పరిస్థితి పైన పటారం లోన లొటారం అని బట్టబయలు చేసింది.
ఆదివారం (ఏప్రిల్ 30) రాత్రి కురిసిన వర్షానికి సచివాలయం మీడియా సెంటర్ లో వాటర్ లీకేజీ కనిపించింది. శ్లాబ్ మీద నుంచి నీరంతా మీడియా హాల్ లోకి వచ్చేసింది. అంతేనా ఫిల్లర్ పగుళ్లు వారంది. సచివాలయం మీడియా హాల్ లో ప్రస్తుతం మీడియా ప్రతినిథులు అడుగు పెట్టేందుకు కూడా వీళ్లేనంత చెమ్మగా మారిపోయింది.
అంచనా వ్యయాన్ని నాలుగు రెట్లు పెంచి మరీ అద్భుత నిర్మాణం అంటూ నిర్మించిన ప్రతిష్ఠాత్మక కట్టడం ఒక్క వానకే నీరు కారడం, చెమ్మగిల్లడం, ఫిల్లర్ బీటలు వారడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు వచ్చేస్తున్నాయన్న తొందరలో హడావుడిగా పనులు ముగించేశారా? నాణ్యత గురించి పట్టించుకోలేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అకాలంలో కురిసిన ఒక్క వర్షానికే కొత్త సెక్రటేరియెట్ పరిస్థితి ఇలా తయారైతే.. ఇక వర్షాకాలంలో కురిసే భారీ నుంచి అతి భారీ వర్షాలు, తుపానులు సంభవిస్తేనూ సచివాలయం పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఇప్పటికే అంటా వర్షానికి సచివాలయ డొల్ల తనం బయటపడటానికి ముందే సచివాలయ ఉద్యోగులు పెదవి విరిచేశారు. సచివాలయంలో వర్క్ స్పేస్ చాలా తక్కువగా ఉందని, తమతమ శాఖలకు కేటాయించిన ప్రదేశంలో ఉద్యోగులు ఇరుకిరుకుగా కూర్చుని పని చేయాల్సిందేనని వారు ప్రారంభోత్సవానికి ముందే మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.