రజనీకాంత్ పై వైసీపీ ఈ విమర్శలేంటి?
posted on May 1, 2023 @ 10:16AM
ఎన్టీఆర్ ను దించినప్పుడు కూడా చంద్రబాబు పక్కనే రజనీకాంత్ కుర్చున్నారని, ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి సభకు పిలిచినప్పుడు కూడా.. ఆయన చంద్రబాబు పక్కనే కూర్చున్నారని, పైగా చంద్రబాబును రజనీకాంత్ పొగిడారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఎన్టీఆర్ జయంతి సభలో రజనీ కాంత్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. చంద్ర బాబు 2004 వరకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నా రన్నారు. గత 20 ఏళ్లలో బాబు లేకుండానే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. బాబుపై రోజా వ్యాఖ్యలు ఇలా ఉంటే..
మంత్రి అంబటి తాను తక్కువ తినలేదనేలా.. రజినీకాంత్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి వస్తానని చెప్పి, పారిపోయిన పిరికి పంద సినీ నటుడు రజనీకాంత్ అని అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత రజనీకి లేదన్నారు. ప్రతిపక్షాలపై ఎప్పుడూ అత్యంత దారుణంగా నోరు పారేసుకునే కొడాలి నాని విమర్శలు మరోలా ఉన్నాయి. రజనీకాంత్ తమిళనాడులో హీరో కావచ్చు, ఇక్కడ మాత్రం జీరో. అతను చెబితే మేం చంద్రబాబు గురించి తెలుసుకోవాలా?' అని ఎమ్మెల్యే కొడాలి నాని సూపర్ స్టార్ రజనీకాంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో జరిగిన శతజయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్ గురించి గొప్పలు చెప్పిన రజనీకాంత్, ఆనాడు ఆయనపై వైస్రాయ్ హోటల్ వద్ద దాడి జరిగి నప్పుడు ఎందుకు రాలేదన్నారు.
చంద్రబాబు విజన్ గురించి మాట్లాడితే ఇక్కడ పట్టించుకునే వారెవరూ లేరన్నారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే ఆరు రోజులు ఆసుపత్రిలో ఉండే ఆయన పక్క రాష్ట్రం నుంచి వచ్చి నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమన్నారు.
సీనియర్ నటుడు, మృదు స్వభావి, వివాదాలకు అతీతంగా ఉండే సూపర్ స్టార్ రజినీకాంత్ పై వైకాప నేతలు, మంత్రులు అత్యంత ఘోరంగా నోరు పారేసుకోవడం ఏంటని ప్రజలు విస్మయం చెందుతున్నారు.