వైసీపీలో రగులుతున్న అసమ్మతి అగ్గి
posted on Apr 29, 2023 @ 4:58PM
చాలా రోజులుగా వైసీపీలో అసమ్మతి చాపకింద నీరులా విస్తరిస్తోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఆ అసమ్మతి భగ్గుమని పార్టీ హైకమాండ్ కు ఆ సెగ తగలడానికి ఇంకెంతో కాలం పట్టదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఏడాది కిందట ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించినప్పుడు రగిలిన అసమ్మతి జ్వాల ఇప్పుడు భగ్గుమంటోంది.
జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని రూపంలో వైసీపీ పార్టీకీ, జగన్ సర్కార్ కీ గట్టి షాక్ తగిలింది. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలం సురేష్ ను మంత్రి వర్గంలో రెండవసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధువైన తనను పక్కన పెట్టడంతో అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఆ తరువాత తమాయించుకుని సర్దుకుపోయినట్లు కనిపించినా కీలెరిగి వాతపెట్టన చందంగా సమయం చూసి గట్టి షాక్ ఇచ్చారు. ఓ వంక బాబాయి మర్డర్ కేసులో బ్రదర్ అవినాష్ రెడ్డి అరెస్టు, తదనంతరం చోటు చేసుకునే పరిణామాలు భయపెడుతుంటే, అదే సమయంలో మరో బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి జగన్ కు గట్టి షాకే ఇచ్చారు. బాలినేని తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించారని అంటున్నారు.
మంత్రి పదవి నుంచి బాలినేనిని తప్పించిన జగన్ ఆయనను ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ సమన్వయ కర్తగా నియమించారు. అయితే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌కు జగన్ కేబినెట్లో రెండో సారి చోటు దక్కింది. దీనిపై బాలినేని ఆగ్రహంతో ఉన్నారు. అలాగే తనకు వ్యతిరేకంగా పార్టీలో కొంతమంది పనిచేస్తున్నారని ఇటీవలే బహిరంగంగా వ్యాఖ్యానించారు. అలాగే ఇటీవల మార్కాపురంలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి సభ వద్ద పోలీసులు తనను అడ్డుకోవడంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేస్తే తప్ప బాలినేని వేదికపైకి రాలేదు. ఆ సంఘటన జరిగిన నాటి నుంచి పార్టీ అధిష్టానంపై బాలినేని గుర్రుగా ఉన్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, వైఎస్ జగన్‌కు బంధువైన బాలినేని.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నుంచి జగన్‌తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో మంత్రి పదవిని కూడా త్యాగం చేసి జగన్ పార్టీలో చేరారు.
ఒంగోలులో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి జగన్ వెంటే ఉంటూ వచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేని మంత్రి పదవి చేపట్టారు. కానీ మూడేళ్లు తిరిగే సరికి ఆయనను జగన్ పక్కనపెట్టేశారు. అదే సమయంలో జిల్లాలో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిమూలపు సురేష్‌ను మరోసారి మంత్రిగా కొనసాగించారు. అయితే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒకరిని తొలగించి మరొకరిని కొనసాగించడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అప్పట్లోనే జగన్‌కు బాలినేని వివరించారు. అయినప్పటికీ బాలినేని మాటలను పట్టించుకోని జగన్.. మంత్రిపదవి నుంచి బాలినేని తొలగించి.. ఆదిమూలపు సురేష్‌ను పురపాలక శాఖ మంత్రిగా కొనసాగించారు.
దీంతో అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న బాలినేని మార్కాపురం ఘటనతో ఇక సర్దుకు పోవలసిన అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. జిల్లాలో ముఖ్యమైన లీడర్‌గా ఉన్న బాలినేని... వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడం.. జిల్లా రాజకీయాలతో పాటు మొత్తం వైసీపీ పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది. ముందు ముందు బాలినేని రూట్లోనే మరిందరు ఎమ్మెల్యేలు అడుగులు వేసే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సైతం జగన్ తీరు పట్ల తన అసహనాన్నీ, అసంతృప్తినీ బాలినేని కోర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన రోజునే వ్యక్తం చేయడం ఎంత మాత్రం కాకతాళీయం కాదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ఇలా ప్రాంతాలతో సంబంధం లేకుండా జగన్ పార్టీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటూనే ఉన్నాయననీ, బాలినేని, పెద్దారెడ్డి లాగే రానున్న రోజులలో మరింత మంది తమ అసమ్మతి, అసంతృప్తిని బహిర్గతం చేసే అవకాశాలున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో అవినాష్ ను కాపాడడానికి జగన్ తన పరిధి దాటి వ్యవహరించారన్న భావన పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతోంది. ఎంత ప్రయత్నించినా అవినాష్ ను సీబీఐ అరెస్టు నుంచి తప్పించలేకపోయిన జగన్ ఇక ఆ కేసు అక్కడ నుంచి ముందుకు సాగకుండా.. విపక్షాలు ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నట్లుగా తాడేపల్లి ప్యాలెస్ వైపు అడుగులు పడకుండా ఉంటే చాలన్న భావనకు వచ్చారనీ, అందుకే ఇప్పుడు పార్టీలో అసమ్మతి లుకలుకలు, నేతల మధ్య విభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టే అవకాశం ఇసుమంతైనా లేదనీ అంటున్నారు. అందుకే ముందు ముందు వైసీపీలో అసమ్మతి ఆగ్రహ జ్వాలలు మరింతగా ప్రజ్వరిల్లే అవకాశాలున్నాయని అంటున్నారు.