కర్నాటకలో కాంగ్రెస్ కు తోడుగా కమల్ హసన్!
posted on May 1, 2023 @ 12:19PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత ఉపందుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాని నరేంద్ర మోదీ ‘విషసర్పం’ అంటూ దూషించిన నేపధ్యంలో శనివారం(ఏప్రిల్29) కర్ణాటకలో సుడిగాలి పర్యటన చేసిన మోదీ, కాంగ్రెస్ నేతల తనను దూషించిన ప్రతిసారీ ప్రజలు వారికి తగిన గుణపాఠం చెపుతూనే ఉన్నారని గతాన్ని గుర్తుచేశారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తనను 91 సార్లు దూషించారని ప్రధాని మోదీ అన్నారు.
కాంగ్రెస్ నేతలు నన్ను విష సర్పం.. చౌకీదార్ చోర్ అని ప్రచారం చేస్తున్నారు. లింగాయత్ సోదరులను అవినీతి పరులన్నారు. అయితే, నన్ను దూషించిన ప్రతిసారీ ప్రజలు వారికి తగిన గుణపాఠం నేర్పారు అని మోదీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను, దేశం కోసం పోరాడిన సావర్కర్‌ను విమర్శించిన వారు తనను వదిలిపెడతారా? అంటూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు.
అలాగే గతంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకేర్ణ ప్రభుత్వంపైన మోదీ బాణాలు ఎక్కుపెట్టారు. ‘ప్రధాని కిసాన్ సమ్మాన్’ పథకంలో లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి పంపలేదని విమర్శించారు. ఆ పథకంలో లూటీ చేసేందుకు వారికి అవకాశం లేకపోవడంతో వెనకడుగు వేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలకు పేదల కష్టాలు అర్థం కావని అన్నారు.
డబుల్ ఇంజన్ పాలనలో పేదల సంక్షేమం వేగవంతంగా సాగుతోంది. డబుల్ ఇంజిన్ అంటే డబుల్ బెనిఫిట్, డబుల్ స్పీడ్. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలోను బీజేపీ ప్రభుత్వాలు ఉంటే డబుల్ శక్తి వస్తుంది. తద్వారా దేశంలోనే కర్ణాటక నంబర్ వన్‌గా మారుతుంది. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఆశీస్సులు అందించాలి అని ప్రధాని కోరారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అన్న కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ప్రకటనపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలసిపోయి, ఓడిపోయిన కాంంగ్రెస్ సను ప్రజలు ఎన్నుకోరు. ఉత్సాహంతో నిండిన బీజేపీని గెలిపిస్తారు అని అన్నారు.
ఈసారి సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే మాట కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రతిధ్వనిస్తోందని చెప్పారు. అయితే మోదీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ దీటుగా తిప్పికొట్టింది. ప్రధాని మోదీకి ప్రజల బాధలు తెలియవని, వారి కష్టాలు వినే ఓపిక ఆయనకు లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా ఎదురుదాడి చేశారు. అంతే కాదు ప్రజల ముందు సొంత బాధలు చెప్పుకొంటున్న తొలి ప్రధాని మోదీ అని ప్రియాంక అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా నవలగందలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు. దేశంలో ఎంతోమంది ప్రధానులను చూశా. వారెవరూ మోదీలా సొంత బాధలు చెప్పుకోలేదు అన్నారు. కర్ణాటకలో అవినీతిపరులకు బీజేపీ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు. 40 శాతం కమీషన్ వ్యవహారాన్ని భరించలేక పోతున్నామని కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు ప్రధానికి స్వయంగా లేఖ పంపినా స్పందన లేదన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దిక్సూచి కానున్నాయని, కాంగ్రెస్ విజయాలకు ఈ ఎన్నికలు నాంది పలకడం ఖాయమని కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్ అన్నారు.
ఇదలా ఉంటే, ప్రముఖ సినిమా హీరో, “మక్కల్ నీదిమయ్యం’అధ్యక్షుడు, కమల్‌హాసన్ కాంగ్రెస్‌కు మద్దతుగా శాసనసభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కోరిక మేరకు ఆయన మే మొదటివారంలో కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ప్రచారం చేయనున్నారని ఎంఎన్‌ఎం నేతలు తెలిపారు. కమల్ ప్రచార పర్యాటన వివరాలు త్వరలో వెల్లడవుతాయని చెప్పారు. రాహుల్ జోడోయాత్ర నిర్వహించినప్పుడు కమల్ ఢిల్లీలో ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేయనున్నారు. ఈ అంశాలను పరిశీలిస్తే వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్ నీదిమయ్యం కాంగ్రె్‌సతో పొత్తు కుదుర్చుకోవటం ఖాయమని తెలుస్తోంది.
ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహరచనలపై గత రెండు రోజులుగా కమల్ కోయంబత్తూరు, సేలం జిల్లాలకు చెందిన పార్టీ నిర్వాహకులతో సమావేశమై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఖరారైతే పార్టీ నాయకుడు కమల్‌హాసన్ కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేయాలని పార్టీ నిర్వాహకులు కోరారు.2021 శాసనసభ ఎన్నికల్లో కమల్‌హాసన్ కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తే విజయం తథ్యమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
అయితే, స్వరాష్ట్రంలో ఒక సీటు గెలుచుకోలేని, కమల్ సహన్ ప్రచారంతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది అనే విషయంలో కాంగ్రెస్ నేట్ల్లోనే అనుమాన్నలున్నాయి. అయినా, కర్ణాటక ఎన్నికలలో చావూ రేవో తెలుచుకునేందుకు సిదమైన కాంగ్రెస్ పార్టీ, ఏ చిన్న అవకాశాన్ని జారవిదుచుకునేందుకు సిద్డంగా లేదని అందుకే రాహుల్ గాంధీ కమల్ హెల్ప్ కోరారని అంటున్నారు.