ఐటీ దాడులతో టీడీపీలో కలవరం.. నాన్ బీజేపీ పార్టీలతో టచ్ లోకి వెళ్లాలని నాయుడు యోచన!
posted on Feb 7, 2020 @ 3:19PM
ఒకవైపు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రస్తుతం తెలుగుదేశాన్ని చుట్టుముడుతున్న తీరు, తెలుగుదేశం అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. దీన్ని ఎలా అధిగమించాలి అని తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్న తరుణంలోనే ఆ పార్టీకి రాష్ట్రంలో కష్టకాలం మొదలైంది. పార్టీ అగ్ర నాయకత్వానికి అతి దగ్గరి వారైన అందరినీ ప్రస్తుతం జరుగుతున్న ఇన్కమ్ టాక్స్ దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
గడిచిన 50 రోజులుగా మూడు రాజధానుల వివాదంతో బలంగా ప్రజల్లోకి వెళ్లి గలిగిన తెలుగుదేశం పార్టీ, తాజాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అనుయాయుల నివాసాల మీద, కార్యాలయాల్లోనూ జరుగుతున్న ఇన్కమ్ టాక్స్ దాడులతో ఆత్మరక్షణలో పడిపోయింది. నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, లోకేష్ అనుచరుడు కిలారు రాజేష్, ఇంకా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు నివాసాలపై, ఇన్కమ్ టాక్స్ అధికారుల బృందం ఒకేసారి హైదరాబాద్ ,విజయవాడలో దాడులు జరిపింది.
2 నెలల క్రితం, నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ పెద్దలతో జరిపిన రాజీ మంతనాలు చంద్రబాబు నాయుడుకు ఎటువంటి ఊరటను ఇవ్వకపోగా బీజేపీ అధిష్టానం, ఇప్పట్లో తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధంగా లేదనే సంకేతాలను పంపాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో దూకుడు పెంచిన బిజెపి, తెలుగుదేశంతో సమానంగా అధికార వైయస్సార్సీపి పై ఉద్యమాల బాట పట్టింది. ఆరడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ బిజెపికి తోడవడంతో, ప్రస్తుతానికి తెలుగుదేశంతో దూరం పాటించాలనే ఆలోచన లో బిజెపి హెడ్ క్వార్టర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
రాజకీయంగా ఒక చిత్రమయిన పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ , వ్యూహాత్మకంగా వెళ్లలేక పోతుంది అనే భావన పార్టీ క్యాడర్లో నెలకొని ఉంది. మూడు రాజధానుల ప్రకటన చేసి జగన్మోహన్రెడ్డి సర్కార్, తెలుగుదేశం పార్టీకి కావలసినంత ఆక్సిజన్ ఇచ్చినప్పటికీ, తాజాగా జరిగిన ఐటీ దాడులు ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. 2024 లో కనీసం ప్రతిపక్ష స్థాయిని చేరుకోవాలని భావిస్తున్న బిజెపి, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దశలవారీగా దెబ్బ కొట్టడానికి వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను టచ్ చేస్తే, రాష్ట్రంలో ఆ పార్టీ బలహీన పడుతుందని, తద్వారా బీజేపీని బలోపేతం చేసుకోవచ్చునని అమిత్ షా ఇప్పటికే ఒక దిశా నిర్దేశనం చేసినట్టు సమాచారం. అందులో భాగంగానే, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో టిడిపి ముఖ్య నాయకుల నివాసాలు కంపెనీల పైన కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోందని తెలుగుదేశం భావిస్తోంది.
ఒకవైపు ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో పాటు, మరోవైపు పార్టీ అంతర్గత నిర్మాణం లో ఎటువంటి గ్యాప్ లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీకి, బిజెపి వైపు నుంచే ఎక్కువ ప్రమాదం కనిపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తనకు లేదని ఖరాఖండిగా చెప్పేసిన వైయస్సార్ సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ రకంగా టీడీపీకి రిలీఫ్ ఇచ్చినప్పటికీ, మరోవైపు బిజెపి దూకుడుగా వెళుతూ రాష్ట్రంలో టిడిపిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది.
ఈ ఉధృతి ఇలాగే కొనసాగితే, నాయుడు ముఖ్య అనుచరులపై కేంద్ర సంస్థలు మరికొన్ని కేసులతో, తెలుగుదేశాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు జరగవచ్చునని సంకేతాలు ఉన్నాయి. దరిదాపుల్లో టీడీపీకి, బిజెపి నుంచి స్నేహ హస్తం అందే అవకాశం లేక పోవటం వల్ల, ప్రస్తుతానికి అడుగులు ఆచి తూచి వేయాలని, అవసరమైతే నాన్ బిజెపి పార్టీలతో మరోసారి జట్టు కట్టి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.