Read more!

నాయుడు మాజీ పీ.ఎస్. పెండ్యాల శ్రీనివాస్ చెప్పిన ఆ ఇద్దరూ ఎవరు?

ఒక ఇన్ ఫ్రా మేజర్ ద్వారా జరిగిన లావా దేవీ ల వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ తలకు చుట్టుకుంటోందా? 36 గంటల పైబడి జరుగుతున్న విచారణ లో పెండ్యాల ఇంతకీ ఎంఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈ.డీ) కి ఏమి సమాచారం చేరవేశారు? కిలారు రాజేష్, గుత్తా కిరణ్ లనూ ఇదే విషయమై విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మూడో రోజు కూడా శ్రీనివాస్ ఇంటిలో ఈ.డీ. చేస్తున్న సోదాలకు , డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డి.ఆర్.ఐ.), ఇన్ కమ్ ట్యాక్స్ (ఐ.టీ.) బృందాలు కూడా తోడవటం తెలుగుదేశం పార్టీ సీనియర్లను కలవరపెడుతోంది. పెండ్యాల శ్రీనివాస్ నివాసం లోని రహస్య లాకర్ల నుంచి కీలకమైన ఓత్రాలను స్వాధీనం చేసుకున్న ఈ.డీ. , డీ.ఆర్.ఐ. , ఐ.టీ . బృందాలు ప్రస్తుతం వాటిని అధ్యయనం చేసే పనిలో పడినట్టు సమాచారం. వాస్తవానికి, తమ నాయకుల నివాసాలు, వ్యాపార సంస్థలపైన లోగడ ఐ.టి. దాడులు జరిగినప్పుడు హడావుడిగా మీడియా సమావేశాలు నిర్వహించి కేంద్ర సంస్థలను ఏకిపారేసిన తెలుగుదేశం అగ్రనాయకత్వం ఇప్పుడు జరుగుతున్న సోదాల మీద మాత్రం ఏ రకమైన వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ, కేంద్ర సంస్థల తీరును ప్రశ్నిచే ప్రయత్నం కానీ చేయకపోవటం రాజకీయ వర్గాలను విస్తుపోయేలా చేస్తోంది.

వాస్తవానికి, నిరుడు అక్టోబర్ లో జరిగిన సోదాల్లోనే ప్రముఖ ఇన్ ఫ్రా మేజర్ పేరు వెలుగులోకి వచ్చింది. అమరావతి నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకున్న ఆ సంస్థ, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ ద్వారా జరిపిన లావా దేవీల వ్యవహారం అంతా గమనించిన సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సి.బి.డి.టి.), ఇంకా ఐ.టి. అధికారులు ఆ ఇన్ఫ్రా మేజర్ ద్వారా అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ సంస్థ నుంచి దాదాపు 750 కోట్ల రూపాయల విరాళాలు వెళ్లినట్టు గుర్తించారు. అప్పటి నుంచే, దీనిపైన నిఘా వుంచిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈ.ఓ. డబ్ల్యు. ) ఆ దరిమిలా చేపట్టిన విచారణలో... అప్పటి ముఖ్యమంత్రి పెర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ పేరు ప్రముఖం గా ఫిగర్ అయింది. అలాగే, నారా లోకేష్ కుడి భుజం, ఎడమ భుజాలుగా వ్యవహరించిన కిలారు రాజేష్, గుత్తా కిరణ్ ల వ్యవహారం పైన కూడా ఈ నిఘాసంస్థలన్నీ దృష్టి సారించాయి. ముంబై కి చెందిన ఇన్ఫ్రా మేజర్ నుండి 150 కోట్ల రూపాయల  విరాళం తెలుగుదేశం పార్టీకి విరాళంగా వెళ్ళిందంటూ వచ్చిన వార్తల దరిమిలా, ఈ ఎపిసోడ్ లో కీలకపాత్ర పోషించినట్టుగా చెబుతున్న పెండ్యాల శ్రీనివాస్ ను పూర్తి స్థాయి లో విచారించటానికే, ఆయన్ను హైదరాబాద్ తరలించినట్టు సమాచారం. ఐదేళ్ల పదవికాలం లో ఆ సంస్థకు దాదాపు 2230 కోట్ల రూపాయలు పనుల కాంట్రాక్టు పనులు అప్పజెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం లో కీలకమైన శాఖలకు మంత్రులుగా వ్యవహరించిన డాక్టర్ నారాయణ, నారా లోకేష్ అనుయాయులపైనా, వారి ఆర్ధిక లావాదేవీల కు సంబంధించిన డాక్యుమెంట్ల పైన లోతైన అధ్యయనం చేయటం కోసమే నిఘాసంస్థలు ఇంత సమయం తీసుకుంటున్నామని సమాచారం. పనులు ఇచ్చినందుకు గాను అప్పట్లో గవర్నమెంట్ కు చెందిన వ్యక్తి కి 700 కోట్లు చెల్లించాలని, అందులో భాగంగా అప్పటి అధికార పార్టీకి ఎన్నికల సమయంలో 150 కోట్ల రూపాయల డబ్బులు అందాయని  దర్యాప్తు సంస్థల విచారణ లో ప్రాధమికంగా వెల్లడైన అంశం.

ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, ఈరోడ్, ఆగ్రా, పూణే, గోవాలతో పాటు 42 చోట్ల, నిరుడు నవంబరు లో జరిపిన సోదాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రముఖ వ్యక్తికి 150 కోట్లు ఇచ్చినట్లు లెక్కలు తేలినట్టు దర్యాప్తు సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. ఎన్నికల సమయం లో 150 కోట్ల రూపాయల డబ్బు  హైదరాబాద్ మీదుగా విజయవాడ కు చేరినట్టు గుర్తించిన ఐటీ అధికారులు, తర్వాతి విచారణ నిమిత్తం, ఈ.డీ., డీ.ఆర్. ఐ. ల సాయం కోరినట్టు సమాచారం.

నిజానికి, ఇంత భారీ స్థాయిలో సోదాలు జరుగుతుంటే, అందునా... తన మాజీ పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ నివాసం లోనూ, లోకేష్ ఆంతరంగికుడు కిలారు రాజేష్, అలాగే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి నివాసాల్లోనూ ఈ సోదాలు గడిచిన 36 గంటలుగా జరుగుతుంటే, తెలుగుదేశం అగ్రనాయకత్వం కిక్కురుమనకుండా కూర్చోవడం ఆశ్చర్యంగా ఉంది. వాస్తవానికి, ఇప్పటికే వైఎస్ఆర్సిపీ ని ఈ ఎపిసోడ్ లో దోషిగా నిలబెట్టే ప్రయత్నం తెలుగుదేశం చేసి ఉండేదనీ, అయితే, అవతల దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలతో రంగంలోకి దిగటం తో ఏమి జరుగుతుందో వేచి చూద్దామనే ధోరణిలోకి తెలుగుదేశం వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే, ఈ పరిణామాలేవీ వైఎస్ఆర్సిపీ కి కూడా మింగుడుపడటం లేదు..కారణమేమిటంటే , రాబోయే రోజుల్లో తమ వ్యాపార, వాణిజ్య సంస్థలపైనా కేంద్ర సంస్థలు ఈ రకమైన సోదాలు నిర్వహించవచ్చునేమోననే సందేహాలు ఆ పార్టీ లోనూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం బట్టి పెండ్యాల శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు పారిశ్రామిక వేత్తల పేర్లు మాత్రమే ...దర్యాప్తు సంస్థల అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.